దండేపల్లి, మార్చి 23 : కడెం ప్రాజెక్టు, గూడెం ఎత్తిపోతల పథకం కాలువలు అధ్వాన్నంగా మారాయి. పెద్ద పెద్ద బుంగలు పడి.. సిమెంట్ లైనింగ్ చెడిపోయి.. పిచ్చి మొక్కలతో నిండి పంటలకు నీరందించలేని దుస్థితికి చేరాయి.
20 వేల ఎకరాల్లో..
దండేపల్లి మండలంలో సుమారు 20 వేల ఎకరాల్లో వరి, మక్క, ఇతర పంటలు సాగు చేశారు. ఇందులో కడెం జలాశయం, గూడెం ఎత్తిపోతల పథకం కింద సుమారు 10 వేల ఎకరాల్లో వరి, మక్క సాగు చేయగా, మిగతా 10 వేల ఎకరాలు వ్యవసాయ బావులు, చెరువులపై ఆధారపడి పంటలు వేశారు. గూడెం ఎత్తిపోతల పథకం నుంచి డీ-30 ద్వారా తానిమడుగు నుంచి సాగు నీరు అందించే కాలువలు పిచ్చి మొక్కలతో నిండిపోయి ఉన్నాయి.
నెల్కివెంకటాపూర్ శివారు నుంచి అందుగులపేట వరకు పంటలకు సాగునీరందించే కాలువలు సిమెంట్ లైనింగ్ చెడిపోయి కనిపిస్తున్నాయి. దీంతో నీరంతా వృథాగా పోతున్నది. దండేపల్లి శివారులోని పంట పొలాలకు వెళ్లే డీ-28 కాలువ పరిస్థితి అధ్వానంగా మారింది. చివరి ఆయకట్టుకు నీరు అందడం లేదు. తాళ్లపేట శివారులో డీ-24 వద్ద కాలువల సిమెంట్ లైనింగ్ చెడిపోయి సైడ్ వాల్ దెబ్బతినడంతో సాగు నీరు రాక పంటలు ఎండిపోతున్నాయి.
వారానికి మూడు రోజులు..
ప్రస్తుతానికి వారబంధీ విధానం కొనసాగుతున్నది. వారానికి మూడు రోజులు నీటిని అందిస్తున్నారు. ప్రస్తుతం వరి, మక్క కంకి దశలో ఉన్నందున నీరు ఎక్కువగా అవసరముంటుంది. కానీ, కాలువల పరిస్థితి ఇలా ఉండడంతో సాగునీరందక పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చింది. అధికారులు ఇప్పటికైనా మేల్కొని శిథిలావస్థకు చేరుకున్న కాలువలకు మరమ్మతులు చేసి పంటలు కాపాడాలని రైతులు కోరుతున్నారు.
నీళ్లు వృథాగా పోతున్నాయి
కడెం జలాశయం నుంచి పంట పొలాలకు నీరందించే కాలువలు పాడైపోయాయి. తూముల పరిస్థితి అధ్వానంగా ఉంది. సిమెంట్ లైనింగ్ దెబ్బతిని నీళ్లు వృథాగా పోతున్నాయి. చివరి వరకు నీళ్లు అందక పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది.
– గోపతి మల్లేశ్, మాకులపేట
మరమ్మతులు చేపట్టాలి
కడెం జలాశయం, గూడెం ఎత్తిపోతల పథకం కాలువలు శిథిలావస్థకు చేరుకున్నాయి. అక్కడక్కడా కాలువలకు బుంగలు పడ్డాయి. చేతికొచ్చే సమయంలో పంటలు ఎండిపోతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టాలి.
-ఉస్మాన్‌ఖాన్, తాళ్లపేట