మంచిర్యాల, డిసెంబర్ 7(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మంచిర్యాల జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యేలపై రోజురోజుకూ అసమ్మతి పెరుగుతున్నది. గెలిచి ఏడాది పూర్తి కావస్తున్నా.. ఎలాంటి అభివృద్ధి చేయకపోవడంపై ప్రజలతో పాటు అధికార పార్టీలోని సొంత లీడర్లలోనే అసంతృప్తి వ్యక్తమవుతున్నది. ఇక శంకుస్థాపనలు, కొబ్బరి కాయలు కొట్టడం తప్ప ఏ ఒక్క పనీ పూర్తి చేసింది లేదన్న చర్చ సాగుతున్నది. ఉచిత బస్సు ప్రయాణం తప్ప.. మిగిలిన పథకాలేవీ అమలు చేయకపోవడంపై అసహనం వ్యక్తమవుతున్నది. రుణమాఫీ చేసి గొప్పలు చెప్పుకుంటూ వచ్చిన నాయకులు, అర్హులైన అనేక మందికి ఎందుకు కాలేదో చెప్పకపోవడంపై కర్షకుల్లో ఆగ్రహం కనిపిస్తున్నది. ఇక గ్యాస్ సబ్సిడీ అమలులోనూ ఇబ్బందులు ఎదురవుతుండగా, రూ. నాలుగువేల పింఛన్, రైతుబంధు, మహిళలకు రూ.2500 వంటివేవీ కార్యరూపం దాల్చకపోవడంతో ఆయా వర్గాల్లో వ్యతిరేకత మొదలైంది. పార్టీ కోసం కష్టపడిన అనేక మంది సీనియర్ నాయకులు జనాలకు ఏమని సమాధానం చెప్పాలో తెలియక.. ఎమ్మెల్యేలపై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తున్నది.
పడిపోతున్న ఎమ్మెల్యేల గ్రాఫ్
ముఖ్యంగా చెన్నూర్, బెల్లంపల్లి నియోజకవర్గాల్లో గడ్డం బ్రదర్స్‌పై సొంత పార్టీ నాయకుల్లోనే తీవ్రమైన వ్యతిరేకత వస్తున్నది. ఎమ్మెల్యేలు స్థానికంగా అందుబాటులో లేకపోవడం నేతల్లో నైరాశ్యానికి కారణమవుతున్నది. చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ ఈ మధ్య నియోజకవర్గంలో రెగ్యులర్‌గా పర్యటిస్తున్నా.. అదంతా వ్యతిరేకత రాకూడదనే ఉద్దేశంతోనే అని తెలుస్తున్నది. ముఖ్యంగా మంత్రి పదవి కోసమే పర్యటిస్తున్నారన్న విమర్శలు సైతం వినిపిస్తున్నాయి. గతంలో బీఆర్ఎస్ సర్కార్ హయాంలో తీసుకువచ్చిన డీఎంఎఫ్టీ ఫండ్స్‌తో రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభించడం, కొబ్బరికాయలు కొట్టడం తప్ప వివేక్ ఎమ్మెల్యేగా గెలిచాక నియోజకవర్గానికి సొంతంగా తీసుకువచ్చిన నిధులు, పనులేవీ లేవనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ లీడర్లు మంజూరు చేయించామని చెప్పిన రోడ్లకే.. తాజా ఎమ్మెల్యే శంకుస్థాపనలు చేయడం సైతం ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తున్నది. ఇక బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్‌పై సొంత పార్టీ నాయకులు బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసుకు వాస్తు మార్పులు తప్ప ఎమ్మెల్యే ఏ పనీ చేయలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మంచిర్యాల నియోజకవర్గంలోనూ శంకుస్థాపనలు తప్ప, పూర్తి చేసిన పనులు ఏవీ లేవు. పైగా ప్రభుత్వం నుంచి పర్మిషన్లు లేకుండానే ఐబీ చౌరస్తాలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌ను కూల్చివేయడం, మార్కెట్ రోడ్డులో కాలువలు తీసి పూడ్చేయడం జనాల్లో తీవ్రమైన చర్చకు దారి తీసింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఎమ్మెల్యే పీఎస్పార్ గ్రాఫ్ పడిపోయిందనే చర్చ ఇప్పుడు జిల్లాలో జోరుగా నడుస్తున్నది.
చెన్నూర్-బెల్లంపల్లిలో కొత్త, పాత వర్గపోరు..
ఇక చెన్నూర్, బెల్లంపల్లి నియోజకవర్గాల్లో అధికార పార్టీలో కొత్త, పాత నాయకుల వర్గపోరు ముదిరి పాకన పడుతున్నది. భీమారంలో ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన ఓ నాయకుడి వర్గానికే పనులు ఇచ్చారంటూ ఎప్పటి నుంచో పార్టీలో ఉన్న నాయకులు ఆరోపిస్తున్నారు. కిందిస్థాయిలో పార్టీని పట్టుకొని ఉన్న నాయకులకు ప్రధాన్యం లేకుండా పోయిందని గతంలో ప్రెస్మీట్లు పెట్టి మరీ చెప్పారు. వాట్సాప్ గ్రూపుల్లో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం భీమారం కాంగ్రెస్ పార్టీ నాయకులకు నిత్యకృత్యంగా మారింది. ఇక బెల్లంపల్లి నియోజకవర్గంలోనూ ఈ తరహా అసమ్మతి పెరిగిపోయింది. ఇందిరమ్మ కమిటీల్లో కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికే ప్రాధాన్యం ఇస్తున్నారంటూ కాంగ్రెస్ లీడర్లు బహిరంగగానే ప్రెస్‌నోట్ విడుదల చేశారు. అదే జరిగితే తీవ్ర పరిణామాలుంటాయంటూ హెచ్చరించారు.
అది మర్చిపోకముందే నెన్నెల మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు సైతం ఎమ్మెల్యేపై అసహసం వ్యక్తం చేస్తూ పెట్టిన మెసేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. గడిచిన పదేళ్లుగా పార్టీ కోసం పని చేస్తూ వచ్చామని, మీరు గెలిస్తే మాకు ఏమైనా పనులు చేసి ఆదుకుంటారనుకున్నామని.. కానీ మీరు మాత్రం బీజేపీ నుంచి వచ్చిన కార్యకర్తల కోసం మాత్రమే పని చేస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు. మీరు చేపట్టిన పనులన్నీ ఒక్కలీడర్కే ఇస్తే స్థానిక లీడర్లు ఏమైపోవాలంటూ ప్రశ్నించారు. ఈ ఘటనలే అధికార పార్టీపై అటు జనాలు, ఇటు సొంత పార్టీ నాయకుల్లో అసమ్మతికి ఉదాహరణలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి ఇప్పటికైనా ఎమ్మెల్యేలు ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటారా లేదా అన్నది వేచి చూడాల్సి ఉంది.