కుంటాల, డిసెంబర్ 3 : మండలంలోని అటవీ ప్రాంతం సమీపంలోని దౌనెల్లి గ్రామంలో చిరుతపులి సంచరించింది. శుక్రవారం రాత్రి పంట చేలకు వెళ్లి వస్తుండగా గ్రామానికి చెందిన పలువురు రైతులకు చిరుతపులి కనిపించడంతో భయంతో పరుగులు తీశారు. దీంతో శనివారం అటవీ అధికారులకు సమాచారం అందించారు. బీట్ అధికారి రేష్మ, సెక్షన్ అధికారి కోటేశ్ ఆధ్వర్యంలో అటవీ అధికారులు పులి సంచరించిన ప్రదేశాన్ని పరిశీలించారు. పాదముద్రలను గుర్తించారు. కొన్ని నెలలుగా దౌనెల్లి అటవీ శివారులో చిరుతపులి సంచరిస్తున్నదని అధికారులు తెలిపారు. పశువులు, మేకల, గొర్రెల కాపరులు జాగ్రత్తగా ఉండాలని, పంట చేలకు వెళ్లే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బీట్ అధికారిణి రేష్మ సూచించారు. సర్పంచ్ ఎండీ హైమద్ గ్రామస్తులను అప్రమత్తం చేశారు.