ఆదిలాబాద్ జనవరి 10(నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ జిల్లాలోని పెన్‌గంగా నుంచి ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతున్నది. జైనథ్, బేల, భోరజ్ మండలాల నుంచి దందా జరుగుతున్నది. అనుమతులు లేకుండా టిప్పర్ల ద్వారా అక్రమార్కులు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. భారీ వానలతో పెన్‌గంగాలో మేటలు వేశాయి. ప్రస్తుతం నది ప్రవాహం తగ్గడంతో ఇసుకాసురులు అక్రమ రవాణాకు తెరలేపారు. ఆదిలాబాద్ జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు కొనసాగుతుండగా.. పంచాయతీ కార్యదర్శులు సిఫార్సు లేఖలతో ట్రాక్టర్ల ద్వారా ఉచితంగా రవాణాకు అధికారులు అనుమతులు ఇస్తున్నారు. ప్రైవేటు అవసరాలకు ట్రాక్టర్‌కు రూ.400 చలాన్ తహసీల్దార్ కార్యాలయంలో చెల్లించివారికి పెన్‌గంగా నుంచి ఇసుక తీసుకుపోవడానికి అనుమతులు మంజూరు చేస్తారు.
నదిలో భారీగా ఇసుక నిల్వలు ఉండడంతో అక్రమార్కులు సరికొత్త విధానం అవలంబిస్తున్నారు. బోటు ద్వారా ఇసుకను వెలితీస్తున్నారు. జేసీబీలతో టిప్పర్లలో నింపుతూ జిల్లాలోని వివిధ ప్రాంతాలతోపాటు మహారాష్ట్రకు చేరవేస్తున్నారు. బేల మండలంలోని కాంగార్పూర్ వద్ద పెన్‌గంగా నదిలో శనివారం పోలీసులు తనిఖీలు నిర్వహించగా బోటుతోపాటు జేసీబీలు, టిప్పర్లు ఉండగా ఒక జేసీబీ, టిప్పర్లను బేల పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
గతంలో ఇసుక క్వారీల ఏర్పాటు వల్ల భూగర్భ జలాలకు నష్టం జరుగుతుందని మైనింగ్ అధికారులు నివేదికలు ఇచ్చారు. పెన్‌గంగా నదిలో క్వారీలు ఏర్పాటు చేయడానికి అవకాశం లేదని నివేదికల్లో సూచించారు. ప్రస్తుతం నది నుంచి భారీగా ఇసుకను తరలిస్తుండడంతో రైతులతోపాటు స్థానికులు నష్టపోయే ప్రమాదం ఉంది. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవాలని స్థానికులు కోరుతున్నారు. బేల మండలంలో పెన్‌గంగా నది నుంచి టిప్పర్ల ద్వారా ఇసుక తరలించడానికి అనుమతుల లేవని తహసీల్దార్ రఘునాథ్‌రావు తెలిపారు.