తాండూర్ : మాదకద్రవ్య రహిత సమాజాన్ని ( Drug-free Society ) నిర్మించాలనే గొప్ప లక్ష్యంలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ ( ACP Ravikumar) పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని, తాండూర్ సర్కిల్ పోలీస్ ఆధ్వర్యంలో మండల కేంద్రం ఐబీలో మాదకద్రవ్యాల నిర్మూలన అవగాహన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు.
మత్తుకు బానిస బంగారు భవిష్యత్తును అంధకారం చేసుకోకండి వంటి నినాదాలతో విద్యార్థులు ప్లకార్డులు ప్రదర్శించి ప్రజలలో చైతన్యం నింపారు. అనంతరం మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా విద్యార్థులు, యువత ప్రతిజ్ఞ చేసి, యాంటీ డ్రగ్ సోల్జర్స్‌గా సంతకాలు చేశారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ దేశ భవిష్యత్తు యువత చేతుల్లో ఉంది. అలాంటి యువత గంజాయి వంటి మత్తు పదార్థాలకు బానిసలై పురోగతికి, ఉజ్వల భవిష్యత్తుకు స్వయంగా అవరోధాలు సృష్టించుకోవద్దు. సమాజం నుంచి మాదకద్రవ్యాలను సమూలంగా నిర్మూలించడానికి ప్రతి ఒక్కరూ నడుం బిగించాలి. గంజాయి వంటి మత్తుపదార్థాల అమ్మకం, వాడకంపై పోలీస్ శాఖ కఠినంగా వ్యవహరిస్తుందని పేర్కొన్నారు.
చెడు వ్యసనాల వల్ల యువత ఆరోగ్యాన్ని, భవిష్యత్తును నాశనం చేసుకోవడమే కాకుండా, చట్టవ్యతిరేక కార్యకలాపాల్లో చిక్కుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సరదాగా మొదలయ్యే అలవాటే వ్యసనంగా మారి జీవితాలను నాశనం చేస్తుందని వెల్లడించారు. మాదకద్రవ్యాలకు సంబంధించిన సమాచారం తెలిస్తే వెంటనే ఉపాధ్యాయులకు, యాంటీ-డ్రగ్ కమిటీలకు , డయల్ 100, 1908 నంబర్లకు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో తాండూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కుమారస్వామి, తాండూర్, మాదారం ఎస్సైలు కిరణ్ కుమార్, సౌజన్య, ఎంఈవో ఎస్ మల్లేశం, నాయకులు సూరం రవీందర్ రెడ్డి, సిరంగి శంకర్, మాసాడి తిరుపతి, సుందిల్ల భూమయ్య, ఉపాధ్యాయులు, విద్యార్థులు, యువకులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.