నిర్మల్ జిల్లా కేంద్రంలో గురువారం నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ సూపర్ సక్సెస్ అయ్యింది. జన ప్రభంజనాన్ని తలపించింది. నిర్మల్, ఖానాపూర్, ముథోల్ నియోజకవర్గాల నుంచి కార్యకర్తలు, నాయకులు, ప్రజలు వేలాదిగా తరలిరాగా ఆ ప్రాంతం కిక్కిరిసిపోయింది. ఫ్లెక్సీలు.. జెండాలతో పట్టణం గులాబీమయమైంది. ప్రముఖ గాయని మధుప్రియ ఆధ్వర్యంలో తెలంగాణ కళాకారులు ఆటా.. పాటలతో హోరెత్తించగా, విశేష స్పందన వచ్చింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగం.. పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజాన్ని నింపింది. ఇక అశేష జనవాహిని చూసి ప్రతిపక్షాలు ఆందోళన చెందుతుండగా, కారు గెలుపు ఖాయమైందన్న అభిప్రాయం ఆయా వర్గాల్లో వ్యక్తమవుతోంది.
– నిర్మల్, నవంబర్ 2(నమస్తే తెలంగాణ)
నిర్మల్, నవంబర్ 2(నమస్తే తెలంగాణ) : నిర్మల్ జిల్లా కేంద్రంలో గురువారం నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ జన ప్రభంజనాన్ని తలపించింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను చూసేందుకు.. కారు గుర్తుకు మద్దతు ప్రకటించేందుకు నిర్మల్, ఖానాపూర్, ముథోల్ నియోజకవర్గాల నుంచి వేలాదిగా తరలిరాగా.. సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. నిర్మల్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఆ పార్టీ శ్రేణులు ఆశించిన దానికంటే రెట్టింపు ఉత్సాహంతో 50 వేలకు పైగా జనం పోటెత్తడంతో పట్టణం గులాబీ వనాన్ని తలపించింది.
సీఎం కేసీఆర్ ఈ పదేండ్లలో చేపట్టిన ప్రగతిని వివరిస్తున్నంత సేపు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. మంత్రి అల్లోల గురించి ప్రస్తావించిన ప్రతిసారి ‘నిర్మల్ టైగర్ ఐకే రెడ్డి’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. సీఎం కేసీఆర్ సభకు వచ్చిన జనం నుంచి సమాధానాలు రాబట్టడం హైలెట్‌గా నిలిచింది.. రైతుబంధు దుబారానా.. అని కేసీఆర్ ప్రశ్నిస్తే కాదంటూ, రైతుబంధు ఉండాలా.. వద్దా అంటే ఉండాలంటూ, కరెంట్ మూడు గంటలు సరిపోతదా అంటే.. వద్దు 24 గంటలు కావాలంటూ, ధరణి ఉండాలా.. పోవాలా అంటే ఉండాలంటూ స్పందించారు. కాగా, సీఎం కేసీఆర్ రాక శ్రేణుల్లో నూతనోత్తేజాన్ని నింపింది. బీఆర్ఎస్ గ్రాఫ్ మరింత పెరిగింది. సభను సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికీ మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. అశేషజన వాహిని చూసిన సీఎం కేసీఆర్ సంతోషం వ్యక్తం చేశారని ఆయన చెప్పారు.
నిర్మల్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ప్రచార సభలో తెలంగాణ కళాకారులు ఆటా.. పాటలతో హోరెత్తించారు. ప్రముఖ గాయని మధుప్రియ ఆధ్వర్యంలో కళాకారులు ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలపై పాటల ద్వారా వివరించారు. రామక పాట పాడుతున్నంత సేపు మహిళలు, పురుషులు అనే తేడా లేకుండా డ్యాన్సులు చేస్తూ కనిపించారు. గులాబీల జెండలమ్మ.. అనే పదం వచ్చిన ప్రతిసారి మెడలో ఉన్న కండువాలు తీసి వాటిని గాలిలో ఊపుతూ ఉత్సాహంగా నృత్యాలు చేశారు.