మహిళా మణులకు అరుదైన గౌరవం దక్కింది. నింగి, నేలా సాక్షిగా అన్నింటిలో దూసుకుపోతున్న అతివలకు చట్టసభల్లో మూడో వంతు రిజర్వేషన్ కల్పించాలనే కల నెరవేరింది. దశాబ్దాలుగా పోరాడుతుండడంతో బుధవారం లోక్‌సభ మహిళా బిల్లుకు ఆమోదముద్ర వేసింది. ఇక రాజ్యసభ ఆమోదముద్ర వేయడమే తరువాయి. ఫలితంగా చట్టసభల్లో మహిళల ప్రాతినిథ్యం పెరగనుంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర సర్కారు స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 శాతం రిజర్వేషన్‌ను అమలు చేస్తున్నది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా 1,251 మంది ప్రాతినిథ్యం వహిస్తున్నారు. పరిపాలనలో మహిళల పాత్రను పెంచడంతోపాటు మహిళా సాధికారితకు ఊతమిచ్చేలా సంక్షేమ పథకాలను అమలు చేస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది. రిజర్వేషన్లతోపాటు ప్రత్యేక పథకాలు అమలు చేస్తుండడంపై మహిళా లోకం హర్షం వ్యక్తం చేస్తున్నది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మహిళలు కేక్‌లు కట్ చేసుకోగా.. ఢిల్లీ లోని జంతర్ మంతర్ వద్ద ఎమ్మెల్సీ కవిత మహిళా బిల్లు కోసం చేసిన పోరాటాన్ని గుర్తు చేసుకుంటూ ఆమె ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేశారు.
– మంచిర్యాల, సెప్టెంబర్ 21(నమస్తే తెలంగాణ ప్రతినిధి)
మంచిర్యాల ప్రతినిధి/కుమ్రం భీం ఆసిఫాబాద్(నమస్తే తెలంగాణ), సెప్టెంబర్ 21 : చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలనే చిరకాల స్వప్నం సాకారమైంది. పార్లమెంట్లో మహిళా బిల్లుకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. పార్లమెంట్‌కు హాజరైన ఎంపీల్లో ఇద్దరు మినహా మిగిలిన వారంతా ముక్తకంఠంతో ఆమోదం తెలుపడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంలో ఇప్పటికే తెలంగాణ సర్కార్ యావత్ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది. రెండోసారి అధికారంలోకి వచ్చాక స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించింది.
పరిపాలనలో మహిళల పాత్రను పెంచడంతోపాటు మహిళా సాధికారతకు ఊతమిచ్చేలా సంక్షేమ పథకాలను అమలు చేస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది. మున్సిపాలిటీలు, పంచాయతీల్లో 50 శాతం రిజర్వేషన్ కల్పించడంతో సగం మంది సర్పంచ్‌లు, కౌన్సిలర్లు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీలుగా మహిళలకే అవకాశం దక్కింది. జనరల్ స్థానాల నుంచి పోటీ చేసి గెలిచిన వారు కూడా తోడవడంతో స్థానిక సంస్థల్లో మహిళా ప్రజాప్రతినిధుల సంఖ్య పురుషుల కంటే అధికంగా ఉంది. ఉమ్మడి జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో మహిళా కౌన్సిలర్లు 155, ఎంపీపీలు 40, ఎంపీటీసీలు 308, జడ్పీటీసీలు 38, స ర్పంచ్‌లు 710 కలుపుకొని 1,251 మంది మహిళలు ఉండడం గమనార్హం.
పాలనలో మహిళలకు పెద్దపీట
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించడంతోపాటు సంక్షేమ పథకాల్లోనూ ప్రాధాన్యం ఇచ్చింది. ఆడబిడ్డ పుట్టిన దగ్గరి నుంచి పెళ్లి అయ్యే వరకు ప్రతి విషయంలో వారికి చేయూతనిచ్చే కార్యక్రమాలు చేపట్టింది. పెండ్లికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ సాయం, గర్భిణులకు కేసీఆర్ కిట్టు, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్, అమ్మ ఒడి, ఆరోగ్యలక్ష్మి పథకాలతోపాటు వితంతువులు, ఒంటరి మహిళలు, వృద్ధులు, బీడీ కార్మికులకు పింఛన్లు ఇస్తున్నది. మహిళలకు విద్యావకాశాలను మెరుగు పరిచింది. ప్రత్యేక గురుకులాలు, ఇంటర్, డిగ్రీ రెసిడెన్షియల్ కళాశాలలను నెలకొల్పింది.
స్త్రీలు స్వశక్తితో ఎదిగేందుకు ఎంబ్రాయిడరీ, కుట్లు అల్లికల్లో శిక్షణతోపాటు ఆసక్తి ఉన్న మహిళలకు షీ ట్యాక్సీ పథకం కింద డ్రైవింగ్ నేర్పిచండంతోపాటు రాయితీ కింద వాహనాలను అందిస్తున్నది. షీ టీమ్స్ ద్వారా ఈవ్‌టీజింగ్‌ను అరికట్టడంతోపాటు సఖీ సెంటర్ల ద్వారా గృహహింస, వివక్షతను ఎదుర్కొంటున్న మహిళలకు బాసటగా నిలుస్తున్నది. బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ కార్పొరేషన్ల 25 శాతం నుంచి 35 శాతం మహిళలకు ఇవ్వడంతోపాటు గృహలక్ష్మి పథకం కింద సొంత ఇంటిని నిర్మించుకునేందుకు రూ.3 లక్షల సాయం అందించే బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది. ఇలా రిజర్వేషన్లతోపాటు ప్రత్యేక పథకాలు అమలు చేస్తుండడంపై మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిస్తున్నదని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
మహిళా బిల్లుపై బీఆర్ఎస్ పోరాటం ఫలించింది..
ఆసిఫాబాద్, సెప్టెంబర్ 21 : కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సమావేశాల్లో మహిళా బిల్లుకు ఆమోదం తెలుపడం అభినందనీయం. బిల్లుపై బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేసింది. ఎమ్మెల్సీ కవితక్క కృషి ఫలించింది. రాష్ట్రంలో ఇప్పటికే స్థానిక సంస్థల్లో బీఆర్ఎస్ పార్టీ 50 శాతం మహిళలకు రిజర్వేషన్ కల్పించింది. అందులో భాగంగా కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 15 జడ్పీటీసీ స్థానాల్లో 9 మంది మహిళలు జడ్పీటీసీలుగా ఉన్నారు. 335 గ్రామ పంచాయతీల్లో 170 మందికి పైగా మహిళా సర్పంచులు ఉన్నారు. అంతేగాకుండా ఎంపీటీసీలు, ఎంపీపీ స్థానాల్లోనూ మహిళలకు ప్రత్యేక స్థానాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ కల్పించారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు, అంసెబ్లీ స్థానాల్లో మహిళలకు ప్రత్యేక రిజర్వేషన్ కల్పించేందుకు ప్రవేశ పెట్టిన బిల్లుకు అన్ని పార్టీలు మద్దతు తెలుపడం గొప్ప విషయం. మహిళలు రాజకీయాల్లో రాణించాల్సిన అవసరం ఉంది. మహిళలు రాజకీయాల్లోకి వస్తే నిలదొక్కుకోవడం కష్టమనే అపోహలను పక్కన బెట్టాలి. మహిళల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు అవగాహన సదస్సులు నిర్వహించాల్సిన అవసరం ఉంది.
– కోవలక్ష్మి, జడ్పీ చైర్పర్సన్, ఆసిఫాబాద్
కవిత పోరాట ఫలితం..
గుడిహత్నూర్, సెప్టెంబరు 21 : ఎమ్మెల్సీ కవిత పోరాట ఫలితంగానే మహిళా బిల్లుకు ఆమోదం లభించింది. కవిత ఎంపీగా ఉన్నప్పటి నుంచి అన్ని పార్టీల వారిని ఒకతాటిపైకి తీసుకొచ్చి మహిళా బిల్లు కోసం పోరాడారు. సీఎం కేసీఆర్ ఆడబిడ్డల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని నామినేటెడ్ పదవులతోపాటు పంచాయతీ, మున్సిపాల్టీల్లో సగం స్థానాలు మహిళలకే కేటాయించారు. గుడిహత్నూర్ సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీగా పదవిలో కొనసాగాను. – ఆడె శీల, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, ఇచ్చోడ
ఆమోదం.. ఆనందం..
మంచిర్యాల టౌన్, సెప్టెంబర్ 21 : మహిళా లోకానికి ఇది నవశకం అని చెప్పొచ్చు. మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించచేందుకు ఉద్దేశించిన ‘నారీ శక్తి వందన్ అధినియం’ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందడం చాలా సంతోషం. రాబోయే ఎన్నికల నుంచే ఈ బిల్లును అమలు చేయాలని కోరుతున్నాం. దాటవేసే ప్రయత్నాలు మానుకోవాలి. బిల్లు ఆమోదానికి బీఆర్ఎస్ అలుపెరుగని పోరాటం చేసింది. సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ కవిత మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో ఏకంగా ఢిల్లీలో దీక్ష చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై కేంద్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు దాటవేస్తూనే వచ్చాయి.
చివరికి దేశవ్యాప్తంగా అన్ని వర్గాల నుంచి ఒత్తిడి రావడంతో ఆమోదించారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో 50 శాతం సీట్లు మహిళలకు కేటాయించారు. ఈ రిజర్వేషన్ వల్లనే నేను మంచిర్యాల మున్సిపాలిటీలో కౌన్సిలర్‌గా ఎన్నికై ప్రజలకు సేవ చేస్తున్నా. ఈ దేశాన్ని 50 ఏళ్లు పాలించిన దౌర్భాగ్య కాంగ్రెస్ పార్టీ మహిళా రిజర్వేషన్ ఏర్పాటు చేయకుండా ఇంతకాలం మహిళలకు తీవ్ర అన్యాయం చేసింది. రాబోయే రోజుల్లో మహిళలు ఇటు అసెంబ్లీ, అటు పార్లమెంటుకు అధిక సంఖ్యలో వెళ్లి ప్రజలకు సేవ చేస్తారు.
– కన్మంతరెడ్డి చైతన్యరెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్, మంచిర్యాల
ఆమోదం హర్షణీయం
కడెం, సెప్టెంబర్ 21 : చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేలా మహిళా బిల్లును బీఆర్ఎస్సహా అన్ని పార్టీలు మద్దతు తెలిపి, ఆమోదించడం హర్షణీయం. ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో మహిళ బిల్లు విషయమై కేంద్రం ముందుకు తీసుకొచ్చి బిల్లు సాధించే వరకు కృషి చేసిన ఎమ్మెల్సీ పోరాట పటిమ అనన్యం. ‘నారీ శక్తి వందన్ అధినియం’ బిల్లును లోక్‌సభ ఆమోదించడంతోపాటు, 33 శాతం రిజర్వేషన్ల అమలుకు కృషి చేయడం, ఇక చట్టసభల్లో మహిళకు ప్రాధాన్యత కల్పించడం అభినందనీయం.
– బద్దెనపల్లి విజయ, సర్పంచ్, దిల్దార్‌నగర్, కడెం
బీఆర్ఎస్ ఒత్తిడితోనే బిల్లు
నిర్మల్ అర్బన్, సెప్టెంబర్ 21 ః కేంద్ర ప్రభుత్వంపై బీఆర్ఎస్ పార్టీ ఒత్తిడితోనే మహిళా బిల్లు ఆమోదం పొందింది. కొన్నేండ్ల నుంచి మహిళా బిల్లును ఆమోదించాలని పార్లమెంటులో ప్రవేశపెట్టాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పోరాటం చేశారు. ఇందు కోసం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కేంద్రానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలను చేపట్టారు. దేశవ్యాప్తంగా మహిళా రిజర్వేషన్లు అమలులోకి రానుండగా తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు, మార్కెట్ కమిటీలలో ఇలా అనేక రాజకీయ పదవుల్లో రాష్ట్రం మహిళలను గౌరవిస్త్తూ పదవులను అందించింది. కేంద్రం ఇప్పుడు అధికారికంగా రిజర్వేషన్లు తీసుకురాగా.. రాష్ట్రం మహిళల గుర్తింపుకు ప్రాధాన్యత ఇస్తున్నది.
– విజయలక్ష్మి, జిల్లా పరిషత్ చైర్పర్సన్, నిర్మల్
కేసీఆర్ చేసిన రిజర్వేషన్‌తోనే చైర్మన్‌ను అయ్యా..
చెన్నూర్, సెప్టెంబర్ 21 : తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత సీఎం కేసీఆర్ వ్యవసాయ మార్కెట్ కమిటీల్లోని పాలక వర్గాల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించడంతోనే చైర్మన్‌ను అయ్యా. సీఎం కేసీఆర్ 2014లో రిజర్వేషన్ కల్పించారు. ఇందులో భాగంగా 2019లో చెన్నూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని మహిళలకు కేటాయించారు. ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఆశీస్సులతో నేను 2019లో మార్కెట్ కమిటీ చైర్మన్‌గా ఎంపికయ్యాను. చెన్నూర్ మార్కెట్ కమిటీ ఏర్పాటైనప్పటి నుంచి ఇంతవరకు మహిళలెవరూ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించ లేదు. సీఎం కేసీఆర్ మహిళలకు రిజర్వేషన్ కల్పించడంతో చెన్నూర్ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా నేను మొదటి మహిళగా పనిచేశా. స్థానిక సంస్థలతోపాటు మార్కెట్ కమిటీల్లో కూడా మహిళలకు రిజర్వేషన్ కల్పించడంతో అనేక పదవులు మహిళలకు లభిస్తాయి.
– మల్లెల మాధవి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, చెన్నూర్.
మహిళలకు దక్కిన గౌరవం..
భైంసా, సెప్టెంబర్ 21 : రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో మహిళలకు సముచిత స్థానాన్ని కల్పించి చిత్తశుద్ధి చాటుకున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలోనే మహిళా బిల్లుకు మద్దతు తెలుపుతూ చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. అంతేగాకుండా ప్రధాని మోదీకి కూడా లేఖ రాసింది. స్థానిక సంస్థల్లో మహిళలకు రాజకీయాల్లో అవకాశాలు కల్పించేందుకు విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్, సర్పంచ్ వంటి వాటిలో.. ఇప్పటికే మహిళలకు సీఎం కేసీఆర్ సముచిత స్థానం కల్పిస్తున్నారు. ఇది మహిళలకు దక్కిన గౌరవం.
– కల్పన జాదవ్, ఎంపీపీ
మహిళలకు సర్కారు ప్రాధాన్యం..
కాగజ్‌నగర్, సెప్టెంబర్ 21 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి మహిళలకు సముచిత స్థానం కల్పించి ప్రాధాన్యమిస్తున్నది. తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించింది. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లుకు రాష్ట్రం పూర్తిగా మద్దతు తెలిపింది. నేను నాలుగుసార్లు సర్పంచ్‌గా పోటీ చేసి మూడుసార్లు గెలిచా. రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన రిజర్వేషన్‌తోనే రెండుసార్లు గెలిచా. ఒకసారి జనరల్ విభాగంలో పోటీ చేసి గెలిచా.
– మడావి రేణుకా, వీర్ధండి సర్పంచ్, కౌటాల
మహిళా రిజర్వేషన్‌తోనే అవకాశం
బెల్లంపల్లి, సెప్టెంబర్ 21 : మహిళా రిజర్వేషన్‌తోనే బెల్లంపల్లి మున్సిపల్ చైర్‌పర్సన్‌గా నాకు అవకాశం లభించింది. తెలంగాణలో సీఎం కేసీఆర్ మహిళలకు అన్ని రంగాల్లో సముచిత స్థానం కల్పిస్తున్నారు. మహిళల ఆర్థిక సాధికారతే లక్ష్యంగా పథకాలు రూపొందిస్తున్నారు. ఏ పథకమైనా మహిళా కేంద్రీకృతంగానే అమలు చేస్తూ వారి ప్రాధాన్యతను పెంచుతున్నారు. పార్లమెంట్ సమావేశాల్లో మహిళా బిల్లు ప్రవేశపెట్టాలని ప్రధాని నరేంద్రమోదీకి సీఎం కేసీఆర్ లేఖ రాశారు. బీఆర్ఎస్ పార్టీ చేసిన నిరసన కార్యక్రమాలతోనే కేంద్రంలో చలనం వచ్చింది. మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలన్న సీఎం కేసీఆర్ లక్ష్యం మహా గొప్పది.
– జక్కుల శ్వేత, మున్సిపల్ చైర్పర్సన్
మహిళా సర్పంచులే అధికం
కడెం, సెప్టెంబర్ 21 : మహిళా బిల్లును ఆమోదించడం, చట్టసభల్లో ఇక తప్పనిసరిగా 33 శాతం రిజర్వేషన్ అమలు చేయడం మంచి పరిణామం. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే మహిళలకు బీఆర్ఎస్ సర్కారు సముచిత స్థానం కల్పిస్తున్నది. ప్రధానంగా పంచాయతీ ఎన్నికల్లో కడెం మండలంలో మొత్తం 28 గ్రామ పంచాయతీలకు గాను 18 మంది మహిళా సర్పంచులే ఉండడం నిదర్శనం. నారీ శక్తి వందన్ అధినియం బిల్లు ద్వారా మహిళా ప్రాధాన్యత చట్టసభల్లో పెరుగనుంది. మా మండలంలో మహిళా సర్పంచులే ఎక్కువగా ఉన్నారు.
– రమాదేవి, సర్పంచ్, పెద్దబెల్లాల్, కడెం