కుమ్రం భీం ఆసిఫాబాద్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ): సమాజంలో పలుకుబడి, రాజకీయ అండదండలు, ఆర్థిక బలం ఉంటే చాలు పేకాడుతూ పోలీసులకు పట్టుబడ్డ ఎలాంటి కేసులు కాకుండా బయటపడొచ్చు. మామూళ్లు ఇస్తే చాలు పట్టుబడిన వారికి బదులుగా వేరే వాళ్లపై కేసులు నమోదు చేస్తారు. డబ్బులు ఇస్తే చాలు పోలీసులను మేనేజ్ చేయవచ్చని తెలిపారు. పేకాడుతూ పట్టుబడిన బడా బాబులకు బదులుగా వారి అనుచరులు, డ్రైవర్లపైనో నామమాత్రంగా కేసులు నమోదు చేయించి, వెంటనే బయటకు తేవచ్చు. ఇలాంటి సంఘటనే వాంకిడి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగినట్లు ఆరోపణలున్నాయి. మంచిర్యాల జిల్లా తాండూరు చెందిన కొంత మంది రాజకీయ నాయకులు వాంకిడి మండలంలోని సరండి గ్రామ సమీపంలోని ఓ చెరువు వద్ద పేకాడుతున్నారన్న సమాచారంతో శుక్రవారం పోలీసులు రైడ్ చేశారు. ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ విషయాన్ని పోలీసులు శనివారం బయటపెట్టారు. పట్టుబడిన వారిని తహసీల్దార్ వద్ద రూ.2 లక్షలకు బైండోవర్ చేసినట్లు ప్రకటించారు. సరండి వద్ద పేకాడుతూ పట్టుబడిన వ్యక్తులకు బదులుగా వేరే వాళ్లపై పోలీసులు కేసు నమోదు చేశారనే ఆరోపణలున్నాయి. పేకాడుతూ పట్టుబడినవారు మంచిర్యాల జిల్లాకు చెందిన ఓ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్, ఓ మాజీ జడ్పీటీసీ, ఓ ఏఐటీయూసీ నాయకుడు, ఓ గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్, మరో జిల్లా స్థాయి నాయకుడు ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. పేకా ఆడుతూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన వీరిపై కేసులు నమోదు చేయకుండా ఈ నాయకులు చెందిన అనుచరులపై కేసు నమోదుశారనే ఆరోపణలు వస్తున్నాయి. నామమాత్రంగా బైండోవర్ కేసును మాత్రమే నమోదు చేసి వదిలేశారని తెలుస్తున్నది.
అది కూడా పేకాడుతూ పట్టుబడిన రోజు కాకుండా మరుసటి రోజు కేవలం బైండోవర్ కేసులు పెట్టి వారిని వదిలివేయడం ఆరోపణలకు బలం చేకూరుస్తున్నది. పేకాడుతూ పట్టుబడ్డ బడా నాయకులపై కేసులు నమోదు కాకుండా ఉండేందుకు లక్షల్లో డబ్బులు చేతులు మారినట్లు ఆరోపణలు వస్తున్నాయి. వారం క్రితం కూడా కాగజ్‌నగర్‌లో పేకాడుతూ పట్టుబడిన రాజకీయ నాయకులను వదిలేసినట్లు ఆరోపణలువచ్చాయి. జిల్లాలో విచ్చలవిడిగా విస్తరిస్తున్న పేకాట వ్యసనం పోలీసులకు కాసులు కురిపిస్తుందనే ఆరోపణలు వస్తున్నాయి.
మండలంలోని సరండి చెరువు సమీపంలో పేకాడుతున్నట్లు అందిన సమాచారం మేరకు ఇద్దరు పోలీసులు వెళ్లి రైడ్ చేశారు. ఏడుగురు పట్టుబడ్డారు. మరో నలుగురు పారిపోయారు. దొరికిన వారిపై బైండోవర్ కేసు పెట్టాం. పారిపోయిన వారిని పట్టుకునేందుకు చర్యలు తీసుకుంటున్నాం. పారిపోయిన వారు ఎవరనేది కచ్చితంగా చెప్పలేం. వారిని కూడా పట్టుకొని చట్టపరంగా చర్యలు తీసుకుంటాం.