బాసర, జూలై 4 : ఆర్జీయూకేటీకి ఎంపికైన విద్యార్థులకు కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహణకు వీసీ వెంకటరమణ ఆధ్వర్యంలో మంగళవారం సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడారు. ఈ నెల 7 నుంచి 9 వరకు నిర్వహించనున్న కౌన్సెలింగ్ ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లతో పాటు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. అకడమిక్ ఇయర్ ప్రారంభమైన సందర్భంగా తరగతుల నిర్వహణ, అధ్యాపకుల పాత్ర, విద్యార్థుల సంక్షేమం తదితర అంశాలపై ఆయా శాఖాధిపతులకు సూచనలు చేశారు. ఇటీవల మృతి చెందిన విద్యార్థిని లిఖిత కుటుంబ సభ్యులకు నాన్‌టీచింగ్ ఎంప్లాయీస్ అసోషియేషన్ ఆధ్వర్యంలో రూ. 30 వేలు వీసీ వెంకటరమణ అందజేశారు.
వీసీని కలిసిన టీఎస్ఐసీ బృందం
బాసర ఆర్జీయూకేటీ వీసీ వెంకటరమణను తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ బృందం సభ్యులు కలిశారు. వచ్చే నెలలో స్వాంతంత్య్ర దినోత్సవం సందర్భంగా నిర్మల్ జిల్లాలో ఇన్నోవేషన్, ఇంక్యుబేషన్ నూతన ఆవిష్కరణలను ప్రదర్శించేందుకు విద్యార్థులు వినూత్న ఆలోచనలతో ముందుకు రావాలని కోరారు. ఇంక్యుబేషన్ ఇన్నోవేషన్ సెల్ కోఆర్డినేటర్ రాకేష్‌రెడ్డి, స్వప్నిల్, అసోషియేట్ డీన్ సృజన, డాక్టర్ పావని ఉన్నారు.