మంచిర్యాల అర్బన్, జనవరి 3 : ప్రజలకు మెరుగైన వైద్యమందించేందుకు కృషి చేస్తున్నామని తెలంగాణ మెడికల్ కౌన్సిల్ లీగల్, ఎథికల్ అండ్ యాంటీ క్వాకరీస్ కమిటీ మెంబర్ డా.యెగ్గెన శ్రీనివాస్, మంచిర్యాల జిల్లా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు డా.పూజారి రమణ అన్నారు. శుక్రవారం పాత మంచిర్యాలలోని ఐఎంఏ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కమీషన్ల కోసం ప్రజలపై భారం మోపుతున్న నకిలీ వైద్యులు, వారికి సహకరిస్తున్న హాస్పిటళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి 30 మంది వైద్యులతో కూడిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా టాస్ ఫోర్స్ టీంను ఏర్పాటు చేశామన్నారు.
వైద్య వృత్తిపై విలువలు, నమ్మకం పెంచడమే ఈ మెడికల్ టాస్ ఫోర్స్ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతూ.. ఆర్థిక భారం మోపుతున్న ప్రైవేట్ వైద్యులపైన చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. 70 వేల మంది వైద్యుల సహకారంతో, వైద్య వ్యవస్థలో ఉన్న వివిధ సంఘాలైన ఐఎం ఏ, తానా, హెఆర్డీఏ, ప్రభుత్వ వైద్యులు, టీజీఎంసీ బృందంగా ఏర్పాటవుతామని తెలిపారు. వరంగల్లో ఇప్పటికే మెడికల్ టాస్ ఫోర్స్ టీం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మెడికల్ టాస్ ఫోర్స్ టీంలో ప్రజలు, న్యాయవాదులు, పోలీసులు, పత్రికా ప్రతినిధులు, వివిధ స్వచ్ఛంద సంస్థలు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, డ్రగ్ ఇన్స్పెక్టర్లను భాగస్వాములను చేసుకొని ముందుకెళ్తామన్నారు. అనైతికంగా వై ద్యం చేస్తున్న డాక్టర్లు, హాస్పిటళ్లకు ఐఎంఏ నుంచి ఎ లాంటి సహాయ సహకారాలు అందవని వెల్లడించారు. ప్రజలకు ఏవైనా ఇబ్బందులుంటే తక్షణమే వాట్సాప్ నంబర్ 7557555777లో సమాచారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ జనరల్ సెక్రటరీ డా.విశ్వేశ్వర రావు, ట్రెజరర్ డా.స్వరూపారాణి, టాస్క్ఫోర్స్ బృందం సభ్యులు, వైద్యులు, తదితరులు పాల్గొన్నారు.