కుమ్రం భీం ఆసిఫాబాద్, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ): అది వాంకిడి మండలంలోని తెలంగాణ -మహారాష్ట్రకు సరిహద్దులో ఉన్న ఎక్సైజ్ శాఖ చెక్‌పోస్ట్… ఇక్కడ ఒక ఎక్సైజ్ సీఐతో పాటు ముగ్గురు కానిస్టేబుల్ స్థాయి అధికారులు విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఇరు రాష్ర్టాలకు మద్యం రవాణా జరగకుండా ఈ మార్గం గుండా ప్రయాణించే ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఇలాంటివేమి ఉండవు. ఈ చెక్‌పోస్టు నిర్వహణలో అధికారులకు బదులు ప్రైవేటు వ్యక్తులు విధుల్లో కనిపిస్తుంటారు.
వీరికి రూ. 20 ఇస్తే చాలు.. ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు వాహనాలకు రైట్ రైట్ చెబుతారు. ఎలాంటి తనిఖీలు ఉండవు. ఈ మార్గం గుండా ఏదైనా వాహనం రాగానే, ఓ వ్యక్తి ఆపుతాడు. వాహన డ్రైవర్ నుంచి రూ. 20 తీసుకుంటాడు. ఇక వాహనాన్ని తనిఖీ లేకుండానే వదిలేస్తాడు. ఇలా రోజుకు సుమారు వెయ్యికి పైగా వాహనాలు తెలంగాణ, మహారాష్ట్రలకు రాకపోకలు సాగిస్తుంటాయి. అంటే ఈ చెక్‌పోస్టు వద్ద నెలకు రూ. 8 లక్షల నుంచి రూ. 10 లక్షల పైచిలుకు వసూళ్ల పర్వం ప్రైవేట్ వ్యక్తుల చేతుల మీదుగా నడుస్తున్నది. మరో వింత ఏంటంటే ఏడాది కాలంలో ఇప్పటి వరకు ఇక్కడ పట్టుబడ్డ కేసులు మూడు మాత్రమే.
ఇరు రాష్ర్టాల నుంచి మద్యం అక్రమ రవాణాపై ఈ చెక్‌పోస్టు వద్ద నిఘా కొరవడింది. కేవలం వసూళ్ల మత్తులో పడి, చూసీచూడనట్లు వదిలేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్రమ రవాణాపై వాహనం నంబర్‌తో సహా సమాచారం ఉంటే తప్పా, తనిఖీ చేయడం లేదు. ఏడాదికి సుమారు 3.5 లక్షల నుంచి 4 లక్షల వాహనాలు ఈ చెక్‌పోస్టు గుండా రాకపోకలు సాగిస్తుంటాయి. ఇక ఒక్క వాహనానికి రూ. 20 చొప్పన ప్రైవేట్ వ్యక్తుల దందా ఏ విధంగా నడుస్తున్నదో ఆర్థం చేసుకోవచ్చు. ఇదంతా ఉన్నతాధికారులకు తెలిసే జరగుతున్నదనే విమర్శలు కూడా లేకపోలేదు.
వాంకిడి సరిహద్దు చెక్‌పోస్టు వద్ద ఒక ఎక్సైజ్ సీఐ, ముగ్గురు కానిస్టేబుళ్లు విధులు నిర్వర్తించాలి. సిబ్బంది కొరత కారణంగా, సహాయంగా ఉండేందుకు ప్రైవేటు వ్యక్తులను పెట్టుకున్నాం. ఏడాది కాలంలో మూడు కేసులు నమోదు చేశాం. ఇందులో ఒకటి గంజాయి కేసు. సరుకు దొరికింది.. నిందితులు పారిపోయారు. మరో రెండు కేసుల్లో మద్యం పట్టుకున్నాం.
– జ్యోతీకిరణ్,జిల్లా ఎక్సైజ్ అధికారి