రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్లు, ఆయాల పోస్టుల భర్తీకి ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. ఈమేరకు ఇప్పటికే ప్రకటన చేయగా, ఆయా జిల్లాలో ఖాళీలపై అధికార యంత్రాంగం దృష్టి పెట్టింది. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా పరిధిలో ప్రధాన అంగన్వాడీల్లో 41, మినీ అంగన్వాడీల్లో 37, 99 హెల్పర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గుర్తించింది. వీటి నియామకం పూర్తయితే కేంద్రాలు మరింత బలోపేతం కానుండగా, . ప్రభుత్వ ప్రకటనపై అభ్యర్థుల్లో హర్షం వ్యక్తమవుతున్నది.
కుమ్రం భీం ఆసిఫాబాద్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర వ్యాప్తంగా పలు శాఖల్లో పెద్ద ఎత్తున కొలువుల బొనాంజా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం.. అంగన్వాడీ టీచర్లు, ఆయాల పోస్టుల భర్తీకి సైతం చర్యలు చేపట్టింది. ప్రభుత్వ ప్రకటన నేపథ్యంలో జిల్లాలో ఖాళీల వివరాలను సేకరించిన అధికారులు పూర్తిస్థాయిలో భర్తీ చేయడానికి కసరత్తు చేస్తున్నారు. ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేయగానే ప్రక్రియను ప్రారంభించనున్నారు.
జిల్లాలోని 15 మండలాల పరిధిలో 834 ప్రధాన, 139 మినీ అంగన్వాడీ కేంద్రాలున్నాయి. ప్రధాన అంగన్వాడీల్లో 41, మినీ అంగన్వాడీల్లో 37, మరో 99 హెల్పర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఖాళీలు భర్తీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో అభ్యర్థుల్లో హర్షం వ్యక్తమవుతున్నది. ఇదిలా ఉండగా మినీ అంగన్వాడీ కేంద్రాలను అప్గ్రేడ్ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీంతో 37 మినీ కేంద్రాలు త్వరలో ప్రధాన కేంద్రాలుగా మారనున్నాయి. అంగన్వాడీ కేంద్రాలు పూర్తిస్థాయిలో బలోపేతం అవుతున్నాయి. మినీ అంగన్వాడీ కేంద్రాలను పూర్తిస్థాయి కేంద్రాలుగా ఉన్నతీకరించడం, ఖాళీ పోస్టులను భర్తీ చేయనుండటంతో గ్రామీణ ప్రాంతాల్లో సేవలు మరింత మెరుగుపడనున్నాయి. ప్రభుత్వం త్వరలో ప్రారంభించనున్న కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లతో శిశువులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందనున్నది.