దివ్యాంగుల్లో ఆత్మైస్థెర్యాన్ని నింపేందుకు, ఆత్మన్యూనతా భావాన్ని తొలగించేందుకు రాష్ట్ర సర్కారు చర్యలు తీసుకున్నది. గత ప్రభుత్వాలు వికలాంగులను పట్టించుకోకున్నా.. సీఎం కేసీఆర్ దివ్యాంగుల సమస్యలపై ప్రత్యేక నజర్ పెట్టారు. వైకల్యంతో బాధపడుతూ.. సమాన స్థాయి కోసం పరితపిస్తున్న దివ్యాంగుల కోసం నేనున్నానంటూ పెద్దన్నగా తన వంతు పాత్ర పోషిస్తున్నారు. సరిలేరు మాకెవ్వరూ అనే రీతిలో దివ్యాంగులు సమాజంలో తలెత్తుకొని జీవించడానికి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇందులో భాగంగా ఆసరా పేరిట ప్రతి వికలాంగుడికి నెలనెలా రూ.3,016 అందిస్తున్నారు. ఇలా నిర్మల్ జిల్లాలో 10,638 మందికి రూ.3.20 కోట్లు ఖర్చు చేస్తున్నది. ఎలక్ట్రిక్ స్కూటీలు, వీల్‌చైర్స్, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్స్ అందిస్తున్నారు. కాగా.. సదరం శిబిరాలు ప్రతినెలా నాలుగు సార్లు నిర్వహిస్తుండగా.. జనవరి నుంచి ఎనిమిది సార్లు నిర్వహించాలని సర్కారు నిర్ణయం తీసుకున్నది.
నిర్మల్, డిసెంబర్ 21(నమస్తే తెలంగాణ) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము దివ్యాంగుల కోసం రూ.కోట్లు ఖర్చు చేసి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నది. ఆసరా పేరిట ప్రతి వికలాంగుడికి ప్రతినెలా రూ.3016 అందిస్తున్నది. ఇలా నిర్మల్ జిల్లాలో 10,638 మందికి రూ.3.20 కోట్లు ఖర్చు చేస్తున్నది. మానసిక ైస్థెర్యం నిండానికి 3,4 నెలలకోసారి మండల, జిల్లా స్థాయిలో క్రీడా పోటీలు నిర్వహిస్తూ మానసికంగా ప్రోత్సహిస్తున్నది. విద్య, ఉద్యోగ రంగాల్లో గతంలో కన్నా రిజర్వేషన్లను పకడ్బందీగా అమలు చేస్తున్నది. ఎనిమిదేండ్లలో దివ్యాంగులకు కేటాయించిన ప్రభుత్వ ఉద్యోగాలను దశలవారీగా భర్తీ చేస్తున్నది. జిల్లాలో 75 శాతం కంటే ఎక్కువ అంగవైకల్యం ఉన్న వారిని ఆదుకోవాలని ఇక్కడి దివ్యాంగుల సంక్షేమ శాఖ ప్రణాళికలు రూపొందించింది. ఇలా తీవ్రమైన వైకల్యంతో బాధ పడుతున్న వారిని గుర్తించి 19 మందికి లక్ష విలువ గల ఒక్కో ఎలక్ట్రిక్ స్కూటీలను పంపిణీ చేసింది. అలాగే వెన్నుపూస సమస్యతో అంగవైకల్యం ఉన్న మరో 14 మందికి బ్యాటరీ సహాయంతో నడిచే వీల్ చైర్స్‌ను అందించింది. కాగా, ఒక్కో వీల్‌చైర్ విలువ రూ.58వేలు. 70 శాతానికి పైగా కంటి చూపు సమస్య ఉన్న నలుగురికి నాలుగు ల్యాప్‌టాప్‌లను అందజేసింది. ఒక్కో ల్యాప్‌టాప్ విలువ రూ.40వేలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. 50 శాతానికి పైగా వినికిడి సమస్య ఉన్న ఆరుగురికి రూ.10 వేల విలువ గల స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేసింది.
సదరం శిబిరాల సంఖ్య పెంపు.. స్వయం ఉపాధికి తోడ్పాటు
వచ్చే జనవరి నుంచి దివ్యాంగుల గుర్తింపుతోపాటు వారికి వికలాంగ సర్టిఫికెట్లను జారీ చేసేందుకు నెలలో ఎనిమిది సార్లు సదరం శిబిరాలను నిర్వహించనున్నారు. ఇప్పటివరకు ప్రతి నెలా నాలుగు సార్లు మాత్రమే ఈ క్యాంపులు నిర్వహిస్తుండడం వల్ల దివ్యాంగులు సర్టిఫికెట్ల కోసం ఇబ్బందులు పడ్డారు. ఈ సమస్యను గుర్తించిన ప్రభుత్వం శిబిరాల సంఖ్య పెంచేందుకు నిర్ణయించింది. దీంతో వైకల్య ధ్రువీకరణ పత్రాల జారీ సులభతరం కానుంది. కాగా.. ముఖ్యంగా దివ్యాంగులు సకలాంగులను పెళ్లి చేసుకున్నా.. ఇరువురు దివ్యాంగులు పెళ్లి చేసుకున్నా వారిని ప్రోత్సహించేందుకు స్వయం ఉపాధి పథకాలు అమలు చేస్తున్నది. దీనికోసం లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నది. పథకాలను పకడ్బందీగా అమలు చేస్తున్నామని నిర్మల్ జిల్లా సంక్షేమ శాఖ అధికారి విజయలక్ష్మి తెలిపారు.
సీఎం సారుకు రుణపడి ఉంటా..
మాది భైంసా మండలం టాక్లీ గ్రామం. పుట్టుకతోనే రెండు కాళ్లు, ఒక చేయి పని చేయక పోవడంతో ఇంటికే పరిమితమయ్యా. ఊరిలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి వరకు చదువుకున్న. రోజు మా నాన్న నన్ను ఎత్తుకొని స్కూల్లో దింపేవారు. ఆ తర్వాత చదువు కొనసాగించలేక పోయా. గత 25 ఏళ్లుగా ఇల్లు దాటి బయటకు పోలేదు. మొన్ననే ప్రభుత్వం బ్యాటరీతో నడిచే వీల్‌చైర్ అందజేసింది. ప్రస్తుతం వీల్‌చైర్‌పై కూర్చొని కుడిచేతి సాయంతో బయటకు వెళ్తున్న. చిన్నచిన్న ఇంటి పనులు కూడా చేయగలుగుతున్న. మాలాంటి అభాగ్యులకు సీఎం కేసీఆర్ దేవుడిలా మారారు. ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటా.
– రాహుల్, టాక్లీ, బ్యాటరీ వీల్‌చైర్ లబ్ధిదారు
ల్యాప్‌టాప్ ద్వారా చదువుకుంటా….
నేను ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న. నాకు దృష్టిలోపం ఉంది. సబ్జెక్టులకు సంబంధించిన పీడీఎఫ్ ఫైళ్లను కాలేజీ లెక్చరర్లు నా మేయిల్‌కు పంపేవారు. ఇలా పంపిన మేయిల్లను ఇప్పటి వరకు స్మార్ట్ ఫోన్ సాయంతో చదవడం, వినడం ద్వారా పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవాన్ని. ఇప్పుడు ప్రభుత్వం ఉచితంగా రూ.40వేల విలువ గల ల్యాప్‌టాప్ అందించింది. దీంతో నాకు చదువుకోవడం మరింత సులువు అవుతుంది. ప్రభుత్వం ఇచ్చిన సహకారంతో ఉన్నత విద్యను అభ్యసించి మంచి ఉద్యోగం సాధిస్తానన్న నమ్మకం కలిగింది.
– అడెల్లు, కుభీర్, ల్యాప్‌టాప్ లబ్ధిదారు
కలలో కూడా ఊహించలేదు..
నాకు ప్రభుత్వం ద్వారా ఎలక్ట్రిక్ స్కూటీ వస్తుందని కలలో కూడా ఊహించలేదు. గతంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి. కానీ.. మాలాంటి దివ్యాంగుల భాగోగులు ఎవరు పట్టించుకోలేదు. సీఎం కేసీఆర్ వచ్చిన తర్వాతనే మా జీవితాలు బాగుపడ్డాయి. ప్రతి నెల రూ. 3016ల పింఛన్ అందుతున్నది. పీజీ చదివిన నేను ముథోల్ మ్యాక్స్ సొసైటీలో లోన్ రికవరీ ఏజెంట్‌గా పని చేస్తున్నాను. విధి నిర్వహణలో భాగంగా రోజుకో గ్రామానికి వెళ్లాల్సి ఉంటుంది. ఇంతకు ముందు ప్రతి రోజు మా భర్త బైక్‌పై తీసుకెళ్లే వారు. ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన స్కూటీపై వెళ్తున్న.
– అనసూయ, సుంక్లి, స్కూటీ లబ్ధిదారు