Sufficient urea | నెన్నెల, జులై 5:మండల రైతులకు సరిపడా యూరియా ఇవ్వాలని నెన్నెల బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పంజాల సాగర్ గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆ పార్టీ ఆధ్వర్యంలో నెన్నెల వ్యవసాయ అధికారి సుప్రజకు శనివారం వినతి పత్రం అందజేశారు. మండలంలో కనీసం యూరియా బస్తా దొరకడం లేదని ఉన్న లింకులు పెట్టి ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు మాత్రం యూరియా సరిపడా ఉందంటున్నారని, లింకు లేకుండా ఎవరూ ఇవ్వడం లేదని ఆరోపించారు.
అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. బస్తా ఒక్కంటికి రూ.320నుంచి 350 వరకు అమ్ముతున్నా ఎవరు పట్టించు కోవడం లేదని వాపోయారు. మండలానికి వచ్చిన యూరియా ఇక్కడి రైతులకు కాకుండా పక్కా మండలాలకు వెళ్లిందన్నారు. సరిపడా యూరియా ఉంటే రైతులు ఎందుకు లైన్లలో ఉంటారని ప్రశ్నించారు. అధికారులు రైతులకు సరిపడా యూరియా ఇవ్వకుంటే ప్రతీ రోజు ప్రభుత్వ కార్యాలయాల ముందు ఆందోళన చేపడుతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమం లో నాయకులు రాంచేందర్, ప్రతాపరెడ్డి, ఇబ్రహీం, తిరుపతి, సున్నం రాజు, మాజీ సర్పంచులు మల్లేష్, శంకర్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.