సర్కారు బడుల్లో సకల సౌకర్యాలు కల్పించి నిరుపేద బిడ్డలకు ఆంగ్ల విద్యనందించే లక్ష్యంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంపై నీలినీడలు కమ్ముకున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు పనులు నిలిచిపోగా, ఆ తర్వాత కొత్త ప్రభుత్వం కొలువుదీరడంతో చేసిన పనులకు బిల్లులు ఇవ్వకపోవడంతో గుత్తేదారులు పనులు నిలిపివేశారు. ఫలితంగా అసంపూర్తి భవనాల మధ్య విద్యార్థులు చదువుకోవాల్సిన దుస్థితి నెలకొన్నది. మరికొన్ని చోట్ల పనులు పూర్తయినప్పటికీ బిల్లులు చెల్లించకపోవడంతో గుత్తేదారులు, పాఠశాల కమిటీ సభ్యులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమం కింద చేపట్టిన పనులను పక్కన పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన ‘అమ్మ ఆదర్శ పాఠశాల’ పనులు చేపడుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
– దండేపల్లి, ఫిబ్రవరి 2
మంచిర్యాల జిల్లాలో 710 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా అందులో ‘మన ఊరు-మన బడి’ కింద 248 పాఠశాలలను ఎంపిక చేసి పనులు మొదలుపెట్టారు. విద్యార్థులకు తాగునీరు, డ్యూయల్ డెస్క్ బెంచీలు, తరగతి గదుల్లో గ్రీన్ చాక్ బోర్డులు (ఆకు పచ్చ రాత బోర్డులు), ప్రతి తరగతి గదిలో విద్యుత్ ఆధునీకరణ పనులు చేపట్టారు. తరగతి గదుల్లో విద్యుత్ దీపాలతో పాటు, ఫ్యాన్లు ఏర్పాటు చేశారు. నీటి సౌకర్యం కల్పించి, చేతులు శుభ్రపరుచుకోడానికి వాష్ బేసిన్స్ ఏర్పాటు చేశారు. పాఠశాల పైకప్పులకు మరమ్మతులు చేశారు. పాఠశాల భవనాలతో పాటు, ప్రహరీకి రంగులు వేశారు. రూ.30 లక్షల లోపు పనులను పాఠశాల యాజమాన్య కమిటీలు పూర్తి చేయగా రూ.30 లక్షల కంటే ఎక్కువ నిధులు అవసరమయ్యే పనులకు టెండర్లు పిలిచి గుత్తేదారులకు అప్పగించారు. చాలా చోట్ల 60-70 శాతం పనులు పూర్తయ్యాయి. మిగతా పనులకు బకాయిలు రాక నిర్మాణాలు నిలిచిపోయాయి. ఈజీఎస్ కింద చేపట్టాల్సిన శౌచాలయాలు, ఇంకుడుగుంత, మైదానం చదును, ప్రహరీ పనులపై గుత్తేదారులు అంతగా ఆసక్తి చూపలేదు. పలు చోట్ల అదనపు తరగతి గదుల నిర్మాణాలు చేపట్టారు. ప్రతి మండలంలో పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన పాఠశాలల్లో మాత్రమే పనులు పూర్తి కాగా, మిగతా పాఠశాలల్లో 60-70 శాతం వరకే చేపట్టి నిలిపివేశారు.
అసంపూర్తిగా భవన నిర్మాణాలు
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ‘మన ఊరు- మనబడి’ స్థానంలో అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమాన్ని తీసుకువచ్చింది. మన ఊరు-మన బడి కింద చేపట్టిన పనులు పూర్తి చేయకుండానే అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమం కింద కొత్త పాఠశాలలను ఎంపిక చేశారు. ‘మన ఊరు-మన బడి’ పనులు పూర్తి చేయాలని గ్రామస్తులు విన్నవించినా సర్కారు పట్టించుకోకపోవడం గమనార్హం. నిధుల మంజూరు, బిల్లుల చెల్లింపు విషయమై గతేడాది నుంచి జిల్లా విద్యాశాఖాధికారులు కలెక్టర్ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నప్పటికీ నిధుల విడుదలలో జాప్యం జరుగుతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం చొరవ చూపి అసంపూర్తి భవనాలు పూర్తి చేసి అందుబాటులోకి తెస్తే విద్యార్థుల ఇబ్బందులు తీరుతాయని గ్రామస్తులు అంటున్నారు.
పనులు పూర్తయినా అందని బిల్లులు..
దండేపల్లి మండలంలోని మామిడిపెల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో మన ఊరు మన బడి పథకం ద్వారా రూ.52 లక్షలు మంజూరయ్యాయి. పనులు పూర్తి చేసుకొని తెలంగాణ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ విద్యా దినోత్సవం రోజున (20 జూన్ 2023)న అప్పటి ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు చేతుల మీదుగా ప్రారంభించారు. విద్యార్థులకు డైనింగ్ హాల్, తాగునీరు, డ్యూయల్ డెస్క్ బేంచీలు, తరగతి గదుల్లో గ్రీన్ చాక్ బోర్డులు(ఆకు పచ్చ రాత బోర్డులు), ప్రతి తరగతి గదిలో విద్యుత్ ఆధునీకరణ, స్మార్ట్ క్లాసులు, మేజర్, మైనర్ రిపేర్, తదితర పనులు చేపట్టారు. తరగతి గదుల్లో విద్యుత్ దీపాలతో పాటు, ఫ్యాన్లు ఏర్పాటు చేశారు. నీటి సౌకర్యం కల్పించి, చేతులు శుభ్రం చేసుకోడానికి వాష్ బేసిన్స్ ఏర్పాటు చేశారు. పాఠశాల పైకప్పులకు మరమ్మతులు చేశారు. పాఠశాల భవనాలతో పాటు, ప్రహరీకి రంగులు వేశారు. రూ.3.50లక్షల ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో పాఠశాలలో కిచెన్ షెడ్డు నిర్మించారు.
బాలబాలికలకు వేర్వేరుగా మూత్రశాలలు నిర్మించారు. అన్ని బాగానే ఉన్నా పనులు చేసిన అప్పటి స్కూల్ కమిటీ సభ్యులకు ఇంకా రూ. 8.50లక్షల బకాయిలు ఉండడం గమనార్హం. పెద్దపేట గ్రామంలోని ప్రాథమిక పాఠశాలది అదే పరిస్థితి. 2023 మార్చి 31న రూ.20 లక్షలతో పనులు పూర్తి చేసి అప్పటి ఎమ్మెల్యే దివాకర్‌రావు, కలెక్టర్ బాదావత్ సంతోష్‌తో కలిసి ప్రారంభించారు. ఇప్పటి వరకు పనులు పూర్తయినా బిల్లులు రూ.5.60 లక్షలు పెండింగ్‌లోనే ఉన్నాయి. జిల్లాలో చాలా పాఠశాలల్లో ఇదే పరిస్థితి నెలకొన్నది. జిల్లాలో చాలా చోట్ల పనులు పూర్తి చేసిన వారిలో స్కూల్ కమిటీ సభ్యులే ఉన్నారు. అప్పులు చేసి పనులు మొదలు పెట్టామని తీరా ప్రభుత్వం మారిపోయాక బిల్లులు ఆపేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పూర్తి చేసిన పనులకు సంబంధించి పెండింగ్ బిల్లులు చెల్లించాలని అప్పటి స్కూల్ కమిటీ సభ్యులు, గుత్తేదారులు కోరుతున్నారు.