పెంచికల్పేట్, జూన్ 27 : ఎరువులు, విత్తనాల విక్రయాల్లో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని మండల వ్యవసాయ అధికారిని మిర్యాల మనీషా అన్నారు. జిల్లా, డివిజన్ వ్యవసాయ అధికారుల ఆదేశాల మేరకు శుక్రవారం పెంచికల్పేట్ మండలంలోని ఫర్టిలైజర్ దుకాణాలను తనిఖీ చేశారు. ఆమె మాట్లాడుతూ దుకాణాల్లో ఉన్న ఎరువులు, విత్తనాల వివరాలను నోటీసు బోర్డుపై రాసి ఉంచాలని, ఎరువులు విక్రయిస్తున్న రైతుల పూర్తి వివరాలు రాసుకోవాలని, లేనిపక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించారు.
అనంతరం గోదాములను తనిఖీ చేశారు. శుక్రవారం ‘నమస్తే తెలంగాణ’లో ‘సబ్సిడీ యూరియా స్వాహా’ శీర్షికన ప్రచురించిన కథనంపై ఉన్నతాధికారులు స్పందించి ఆదేశించడంతో తనిఖీ చేసినట్లు ఆమె తెలిపారు. హాకా సెంటర్లపై దాడులు నిర్వహిస్తామని, పూర్తి విచారణ జరిపి నివేదికను ఉన్నతాధికారులకు అందిస్తామన్నారు. ఈ విషయంపై విజిలెన్స్ అధికారులు సైతం ఆరా తీశారు.