మందమర్రి, జూన్ 3 : మందమర్రి మున్సిపాలిటీలో ఫ్లెక్సీల వివాదం తారాస్థాయికి చేరింది. పట్టణంలోని పాతబస్టాండ్ ఏరియాలో బీఆర్ఎస్ నాయకులు ఆ పార్టీ రజతోత్సవ వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించేందుకు మున్సిపల్ సిబ్బంది పూనుకున్నారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకుని ఫ్లెక్సీల తొలగింపును అడ్డుకున్నారు. మున్సిపల్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. మున్సిపల్ సిబ్బంది గో బ్యాక్, కమిషనర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం మున్సిపల్ కార్యాలయం వద్దకు చేరుకుని కార్యాలయ ప్రధాన గేటు ఎదుట కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల వద్ద నిరసన తెలిపారు. కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.
కార్యాలయం ఎదుట భారీ ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం వినతి పత్రం సమర్పించేందుకు నాయకులు ప్రయత్నించగా.. కార్యాలయంలో అధికారులు అందుబాటులో లేరని సిబ్బంది తెలిపారు. వినతి పత్రం తీసుకోవాలని సిబ్బందిని కోరినా వారు అందుకు నిరాకరించారు. దీనితో నాయకులు వినతి పత్రాన్ని కార్యాలయ గుమ్మానికి సమర్పించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.. మున్సిపల్ పరిధిలోని ప్రధాన రహదారుల వెంట విచ్చలవిడిగా అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రమాదకరంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను పట్టించుకోని అధికారులు కేవలం బీఆర్ఎస్ ఫ్లెక్సీలను తొలగించడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు? మున్సిపల్ కార్యాలయం ప్రధాన ద్వారం ఇరుపక్కల కాంగ్రెస్ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలతో ఇది మున్సిపల్ కార్యాలయమా? లేక కాంగ్రెస్ కార్యాలయమా? అనే విధంగా ఉందని వారు మండిపడ్డారు.
మున్సిపల్ కమిషనర్ ప్రజా సమస్యలను గాలికొదిలేసి అధికార పార్టీ సేవలో మునిగి తెలాగుతున్నాడని వారు ఆరోపించారు. తాము ప్రధాన ప్రతిపక్షంగా ప్రజా సమస్యల పై వినతి పత్రం ఇవ్వడానికి వస్తే తీసుకోక పోవడం తాము ఆరు నెలల క్రితం ప్రమాదకరంగా ఉన్న ఫెక్సీలను తొలగించాలని వినతి పత్రం సమర్పించామని అయినా పట్టించుకోలేదన్నారు. రోడ్డు కూడళ్ల వద్ద ప్రమాదకర ఫ్లెక్సీలను తొలగించాలంటే చర్యలు తీసుకోక లేదన్నారు. మున్సిపాలిటీలోని 24 వార్డులలో బీఆర్ఎస్ ఫ్లెక్సీలు కేవలం రెండే ఉన్నాయని వారు తెలిపారు. మున్సిపాలిటీలో ఎన్నికలు లేవని గిరిజన చట్టం అమలులో ఉందని ఎవరు ప్రజాప్రతినిధులు లేరని వారు పేర్కొన్నారు.
రహదారుల వెంట ఫ్లెక్సీల మూలంగా రాత్రి సమయంలో ప్రమాదాలు జరిగి ఎంతో మంది గాయాలపాలయ్యారని వారు పేర్కొన్నారు. తాము పదేండ్లు అధికారంలో ఉన్నప్పుడు ఎవరి ఫ్లెక్సీలు, జెండాలు తీయలేదని స్పష్టం చేశారు. ఫ్లెక్సీలు తొలగిస్తే అందరివి తొలగించాలని, తమ ఫ్లెక్సీలను తామె తొలగిస్తామని వారు అన్నారు. అంతేకానీ అధికార పార్టీ నాయకుల ఒత్తిడితో భవనాలకు ఎత్తు భాగంలో ఉన్న తమ ఫ్లెక్సీలను తొలగించడం బావ్యం కాదన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్, టీబీజీకేఎస్ నాయకులు ఓ.రాజశేఖర్, బండారు సూరిబాబు, కొంగల తిరుపతి రెడ్డి, బత్తుల శ్రీనివాస్, బోరిగం వెంకటేశ్, మద్ది శంకర్, ఎండి.అబ్బాస్, పంజాల ఈశ్వర్, భట్టు రాజ్‌కుమార్, భూపెల్లి కనకయ్య, ప్రతాప్ సారంగపాణి, బర్ల సదానందం, పల్లె నర్సింగ్, బెల్లం అశోక్, సీపెల్లి సాగర్, అఖిలేశ్ పాండే, కొమరక్క పాల్గొన్నారు.