బాసర, జూలై 13 : బాసర జ్ఞాన సరస్వతీ అమ్మవారి ఆలయంలో గురువారం సీఎం కేసీఆర్ పేరిట ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చల్లగా ఉండాలని ఆయన పేరిట పూజలు నిర్వహించినట్లు ధూపదీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దౌలతాబాద్ వాసుదేవశర్మ తెలిపారు. బాసర క్షేత్రంలో ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ ధూపదీప నైవేద్య అర్చకులకు నెలకు ఇచ్చే గౌరవ వేతనాన్ని రూ.6 వేల నుంచి రూ.10 వేలకు పెంచినందుకు, కొత్తగా 3 వేలకు పైగా నియామకాలు చేపట్టినందుకు అర్చకుల తరుఫున ధన్యవాదాలు తెలిపారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో స్థానిక ఎమ్మెల్యే గణేశ్గుప్తాను ఆహ్వానించి ఉమ్మడి జిల్లా ధూపదీప నైవేద్య అర్చకులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించినట్లు తెలిపారు. త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్ను ఆహ్వానించి రాష్ట్రస్థాయిలో 6,500 మంది అర్చకులతో హైదరాబాద్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ పిండిపోలు నాగ దక్షిణామూర్తి, ఉపాధ్యక్షుడు హరికీర్తి అమరేందర్ శర్మ, నాయకులు గుదే లక్ష్మీనర్సయ్య, పిండిపోలు మౌర్య పాల్గొన్నారు.