నిర్మల్, జనవరి 2(నమస్తే తెలంగాణ): ‘నిర్మల్ పోలీస్-మీ పోలీస్’ అనే నినాదంతో ప్రజలకు ఏడాది కాలంలో మరింత చేరువయ్యామని జిల్లా ఎస్పీ జానకీ షర్మిల అన్నారు. నిర్మల్ జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టి ఈ నెల 4 నాటికి ఏడాది పూర్తి కావస్తున్నది. బాధ్యతలు చేపట్టి నాటి నుంచి ఓ వైపు నేరాలను అదుపు చేస్తూనే శాంతి భద్రతలను పరిరక్షిస్తున్నారు. మరోవైపు సామాజిక కార్యక్రమాలతో గురుతర బాధ్యతను కొనసాగిస్తున్నారు. ఆర్థిక నేరాలతో పాటు కీలకమైన గంజాయి కేసులను ఛేదించి చూపారు. మత్తు పదార్థాల నుంచి యువతను దూరం చేసేందుకు గ్రామ గ్రామానా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా సైబర్ నేరాల అదుపునకు ఎస్పీ తీసుకుంటున్న చర్యలు ప్రశంసలు అందుకుంటున్నాయి. బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల ఆత్మహత్యలు నివారణకు ఆ క్యాంపస్‌ను దత్తత తీసుకొని కౌన్సెలింగ్ ఇవ్వడంతో పాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ఆత్మస్తైర్యం పెంపొందించే చర్యలు తీసుకున్నారు. నిర్మల్, భైంసా పట్టణాల్లో ట్రాఫిక్ నియంత్రణ కోసం ఎస్పీ ప్రత్యేక ప్రణాళిక రూపొందించి ఈ రెండు చోట్ల ట్రాఫిక్ పోలీస్స్టేషన్ల ఏర్పాటు ప్రతిపాదనలను పంపించారు. భరోసా సెంటర్ ద్వారా ఇప్పటి వరకు దాదాపు 50 కుటుంబాలను ఏకం చేసి ఆ కుటుంబాల పిల్లల కళ్లల్లో ఆనందాన్ని చూశారు. జిల్లా పోలీస్ అధికారిగా బాధ్యతలు స్వీకరించి ఏడాదైన సందర్భంగా ఎస్పీ జానకీ షర్మిలతో ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక ఇంటర్వ్యూ చేసింది.
ఎస్పీ: గత ఏడాదిగా పోలీసింగ్‌పై ప్రజలకు నమ్మకం పెరిగేలా చేయగలిగాము. పోలీస్ స్టేషన్లో న్యాయం జరుగకపోతే నేరుగా ఎస్పీ దగ్గరికే వెళ్లవచ్చన్న విశ్వాసాన్ని ప్రజలకు కల్పించాం.
ఎస్పీ: ట్రాఫిక్‌కు సంబంధించి జిల్లాలోని నిర్మల్‌తో పాటు భైంసా పట్టణంలో రెండు చోట్ల ప్రత్యేకంగా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపాము. ఈ ఆర్థిక సంవత్సరం చివరలో మంజూరయ్యే అవకాశం ఉంది. ఆర్అండ్బీ ఈఈ, అడిషనల్ ఎస్పీ, మున్సిపల్ కమిషనర్లతో ప్రత్యేకంగా ఒక కమిటీని వేసి ట్రాఫిక్ సమస్య ఉండే ప్రాంతాలను గుర్తించాం. పలు చోట్ల ఆక్రమణలను తొలగించేందుకు చేపట్టాల్సిన చర్యలపై త్వరలోనే సంయుక్తంగా నిర్ణయం తీసుకుంటాం.
ఎస్పీ: నేను జిల్లా ఎస్పీగా బాధ్యతలు తీసుకున్న తర్వాత బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం చాలా బాధ కలిగించింది. అందులో వ్యక్తిగత కారణాలతోనే ఎక్కువగా చనిపోతున్నట్లు గుర్తించాం. తమ సమస్యలను చెప్పుకునే వాతావరణం అక్కడ లేకపోవడంతో నిస్సహాయ స్థితిలో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ఇక్కడ చదివే విద్యార్థులంతా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన పేద కుటుంబాలకు చెందిన వారు. చదువులో మంచి ప్రతిభ ఉన్నవారు. పదవ తరగతిలో 10 జీపీఏ వచ్చిన వారికే ఇందులో అడ్మిషన్ దొరుకుతుంది. ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన సర్వీస్ కమిషన్ పరీక్షల్లో 200 మందికి పైగా ఇక్కడ చదివిన వారే సెలెక్ట్ అయ్యారు. ఇక్కడ చదివే విద్యార్థులందరినీ జాగ్రత్తగా కాపాడుకోవాలన్న ఆలోచన వచ్చింది. నేను కూడా బిడ్డను కోల్పోయాను. ఆ బాధ ఎలాంటిదో నాకు తెలుసు. ఎదిగిన పిల్లల్ని కోల్పోతే తల్లి దండ్రులకు ఎంతో బాధ ఉంటుంది. మరోసారి ఇలాంటి ఘటనలు జరుగకూడదన్న ఉద్దేశంతోనే ట్రిపుల్ ఐటీని దత్తత తీసుకున్నాను.
ఎస్పీ: వీసీ అనుమతితో బాసర్ ట్రిపుల్ ఐటీని దత్తత తీసుకున్న తర్వాత విద్యార్థులకు రెగ్యులర్‌గా కౌన్సెలింగ్ చేస్తున్నాం. చిన్న చిన్న సమస్యలు ఉంటే వాటిని మా వంతుగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నం. వారానికోసారి ట్రిపుల్ ఐటీకి వెళ్లి రెండు మూడు గంటల పాటు విద్యార్థులతో గడపడం వల్ల వారికి ఏమైనా ఇబ్బందులుంటే నేరుగా చెబుతున్నారు. అత్యవసర పరిస్థితిలో నేను మీకు అండగా ఉన్నాను అన్న భరోసా వారికి కల్పించగలిగాను.
ఎస్పీ: బాసర గోదావరి వద్ద సీసీ కెమేరాలను ఏర్పాటు చేసి రెగ్యులర్‌గా మానిటరింగ్ చేస్తున్నాము. అలాగే అక్కడే పోలీసు పికెటింగ్ కూడా ఏర్పాటు చేశాం. గత పది రోజుల్లో ముగ్గురికి కౌన్సెలింగ్ నిర్వహించాం. నిర్మల్, నిజామాబాద్ సరిహద్దులో ఈ వంతెన ఉన్నందున నిజామాబాద్ పోలీసుల సహకారాన్ని కూడా తీసుకుంటున్నాం. వంతెనకు ఇరువైపులా ఉన్న రేలింగ్‌పై ఇనుప జాలీని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
ఎస్పీ: జిల్లాలో ఇప్పటి వరకు వివిధ కారణాలతో గొడవ పడి విడిపోయిన 50కి పైగా కుటుంబాలను ఈ భరోసా సెంటర్ ద్వారా ఏకం చేశాం. కుటుంబం అనేది సమాజంలో ఒక భాగం. కుటుంబ వాతావరణం బాగా లేకపోతే వాటి ప్రభావం పిల్లలపై పడుతుంది. వారు చెడు మార్గం వైపు వెళ్లే అవకాశం ఉంటుంది. పిల్లలు చేసే నేరాలను పరిశీలిస్తే.. చాలా వరకు వారి తల్లి దండ్రులు విడిపోయిన వారే కనిపిస్తారు. అందుకే దీనిపై ప్రత్యేక దృష్టి సారించాము. కుటుంబాలు బాగుంటేనే చక్కని సమాజం నిర్మితమవుతుంది. ఒక మహిళగా, తల్లిగా ఈ బాధ్యతను తీసుకోవడం నాకు ఎంతో సంతృప్తిని ఇస్తున్నది.
ఎస్పీ: పోలీసు శాఖపై నమ్మకం పెంచేందుకోసం సామాజిక కార్యక్రమాలు మరింతగా దోహదపడుతాయన్న భావనతోనే ఆ దిశగా దృష్టి సారిస్తున్నాను.
ఎస్పీ: నిర్మల్ పోలీస్ మీ పోలీస్