సీసీసీ నస్పూర్, జూలై 14 : నూతన సైన్స్ విధానంపై ప్రత్యేక దృష్టిసారించినట్లు మంచిర్యాల జిల్లా విద్యాధికారి ఎస్ యాదయ్య పేర్కొన్నారు. నస్పూర్‌లోని తీగల్‌పహాడ్‌లో గల పీఎంశ్రీ జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో సోమవారం అటల్ టెంకరింగ్ ల్యాబ్‌పై శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. జిల్లాలోని 19 పీఎంశ్రీ పాఠశాలలకు చెందిన భౌతిక, జీవ, గణితం పాఠాలు బోధించే స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులు శిక్షణకు హాజరయ్యారు.
డీఈవో మాట్లాడుతూ మారుతున్న అవసరాలకు అనుగుణంగా సృజనాత్మకతను పెంపొందింపజేసే నూతన సైన్స్ పరికరాలను విద్యార్థులు వినియోగించుకునేలా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. భవిష్యత్తులో ప్రపంచంతో పోటీ పడాలంటే సైన్స్‌పై ప్రతీ విద్యార్థికి అవగాహన ఉండాలన్నారు. పాఠశాలలో నేటితో వంద అడ్మిషన్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వందో అడ్మిషన్ పొందుతున్న విద్యార్థికి ఆయన అడ్మిషన్ అందజేశారు.
విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన విద్యను అందించడానికి కృషి చేస్తున్న పాఠశాల హెడ్మాస్టర్ వామన్‌రావు, ఉపాధ్యాయుల బృందాన్ని ఆయన అభినందించారు. వనమహోత్సవం సందర్భంగా పాఠశాల ఆవరణలో విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి ఆయన మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో సెక్టోరియల్ అధికారులు సత్యనారాయణమూర్తి, విజయలక్ష్మి పాల్గొన్నారు.