సీసీసీ నస్పూర్, జనవరి 8: పరిసరాల పరిశుభ్రతకు ప్రత్యేక ప్రాధాన్యమిస్తూ.. అత్యధిక ప్రదేశాలను శుభ్రం చేసినందుకుగాను సింగరేణి కాలరీస్‌కు జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు లభించింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన స్పెషల్ క్యాంపెయిన్ 4.0లో ఎక్కువ ప్రాంతాలను పరిశుభ్ర పరిచిన(మ్యాగ్జిమమ్ నంబర్ ఆఫ్ సైట్స్ క్లీన్డ్) విభాగంలో సింగరేణికి అవార్డు వరించింది. ఈ మేరకు మంగళవారం రాత్రి ఢిల్లీలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి చేతుల మీదుగా సింగరేణి సీఎండీ బలరాం ఈ అవార్డును అందుకున్నారు.
కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ పరిధిలోని కోలిండియా, అనుబంధ సంస్థలు, నైవేలీ లిగ్నైట్ సంస్థల్లో గతేడాది అక్టోబర్ 2 నుంచి 31వ తేదీ వరకు స్పెషల్ క్యాంపెయిన్ 4.0 పేరిట స్వచ్ఛతా కార్య క్రమాలు చేపట్టాయి. ఇందులో సింగరేణి వ్యాప్తంగా 11 ఏరియాల్లో 157 చోట్ల పరిసరాలను శుభ్రం చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు. 216 ప్రదేశాల్లో పరిశుభ్రత కార్యక్రమాలను చేపట్టడం విశేషం. ఈ నేపథ్యంలో అత్యధిక సంఖ్యలో ప్రదేశాలను శుభ్రపరిచినందుకుగాను సింగరేణికి ఈ పురస్కారం లభించింది. సింగరేణి చేపట్టిన ఈ పరిశుభ్రత కార్యక్రమానికి గుర్తింపు లభించండంపై సంస్థ సీఎండీ బలరాం హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బొగ్గు శాఖ కార్యదర్శి విక్రమ్ దేవ్‌దత్, అదనపు కార్యదర్శులు రూపేందర్ బ్రార్, విస్మితాతేజ్, సింగరేణి జీఎం శ్రీనివాసరావు పాల్గొన్నారు.