శ్రీరాంపూర్, ఫిబ్రవరి 12 : భూగర్భగనుల్లో ఎస్డీఎల్ యంత్రాల పనిగంటలు పెంచాలని సింగరేణి కార్మికులు, అధికారులకు సీఎండీ ఎన్ బలరాం సూచించారు. బుధవారం సింగరేణి శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే 7 భూగర్భగనిలోకి సీఎండీతో పాటు డైరెక్టర్ (ఆపరేషన్) ఎల్వీ సూర్యనారాయణ, డైరెక్టర్ (పీపీ) కొప్పుల వెంకటేశ్వర్లు మ్యాన్‌రైడింగ్ ద్వారా దిగారు. ఈ సందర్భంగా ఎస్డీఎల్ యంత్రాన్ని సీఎండీ నడిపి కొద్ది సేపు బొగ్గు ఉత్పత్తి తీశారు. అనంతరం ఎస్డీఎల్ ఆపరేటర్లు, కోల్ కట్టర్లు, టెక్నీషియన్లు, సూపర్వైజర్లు, అధికారులతో మాట్లాడి గనిలో పని పరిస్థితులు, యంత్రాల వినియోగంపై అడిగి తెలుసుకున్నారు. ఎస్డీఎల్ యంత్రాల పనిగంటలు పెంచాలని, ఉత్పత్తి వ్యయం తగ్గించేందుకు కార్మికుల పనిగంటలు పెరగాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్వోటూజీఎం సత్యనారాయణ, ఏజెంట్ రాజేందర్, మేనేజర్ జెంగిలి తిరుపతి, డీవైజీఎం చంద్రలింగం, అరవిందరావు, ఏఐటీయూసీ నాయకులు బాజీసైదా, వీరభద్రయ్య, తదితరులున్నారు.
కార్మికుల సమస్యలపై టీబీజీకేఎస్ వినతి
శ్రీరాంపూర్ ఆర్కే 7గనిపై సింగరేణి సీఎండీ బలరాం, డైరెక్టర్లు ఎల్వీ సూర్యనారాయణ, కే వెంకటేశ్వర్లును టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి కే సురేందర్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు పెట్టం లక్షణ్, పిట్ కార్యదర్శి బానోత్ రాజునాయక్, సహాయ కార్యదర్శి పాదం శ్రీనివాస్ కలిసి కార్మికుల సమస్యలు విన్నవించారు. ఈ సందర్భంగా సీఎండీతో పాటు డైరెక్టర్లను శాలువాలతో ఘనంగా సన్మానించి సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సింగరేణి కార్మికుల మారుపేర్లు సవరించాలని, దీనిపై ఇప్పటికే యాజమాన్యం హామీ ఇచ్చిందని చెప్పారు.
11వ వేజ్‌బోర్డులో రిటైర్డ్ కార్మికులకు పింఛన్ రివైజ్ చేయాలని, ఏరియర్స్ చెల్లించాలని కోరారు. శ్రీరాంపూర్‌లో మూతపడనున్న గనులు ఆర్కే 5, 6, ఎస్ఆర్పీ 1, న్యూటెక్ గనుల జీవిత కాలం పెంచాలని కోరారు. శ్రీరాంపూర్ ఏరియాలో శిథిలమైన క్వార్టర్ల స్థానంలో నూతన డబుల్ బెడ్రూం క్వార్టర్లు నిర్మించాలని కోరారు. శ్రీరాంపూర్‌లో నిర్మిస్తున్న గ్రావిటీ వాటర్ ఫిల్టర్ ద్వారా రక్షిత నీటి సరఫరా పనులు త్వరగా పూర్తి చేయాలని , గనుల్లో టెక్నీషియన్లు కొరత తీర్చాలని, నాణ్యమైన పనిముట్లు, బూట్లు అందించాలని కోరారు. ఆర్కే 8 డిస్పెన్సరీని 50 పడకల దవాఖానగా మార్చి మెరుగైన వైద్య సేవలందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బిరుదు శ్రీనివాస్ పాల్గొన్నారు.