ఎదులాపురం, జూలై 21 : భారీ వర్షాల దృష్ట్యా అన్ని పోలీస్స్టేషన్ల సిబ్బంది 24 గంటలు స్పందించేలా అందుబాటులో ఉండాలని ఆదిలాబాద్ ఎస్పీ డీ ఉదయ్ కుమార్ రెడ్డి సూచించారు. స్థానిక పోలీస్ హెడ్‌క్వార్టర్స్ సమావేశ మందిరంలో శుక్రవారం నెలవారీ నేర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. రానున్న 48 గంటలు రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు ఉన్నందున ప్రతి ఒక్క పోలీసు అధికారీ అప్రమత్తంగాఉండి, అత్యవసర సమయంలో త్వరగా సంఘటనా స్థలానికి చేరుకునేలా ఉండాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉంచి అవగాహన కల్పించాలన్నా రు. నూతనంగా జిల్లాకు వచ్చిన పోలీస్ సిబ్బంది, తమకు కేటాయించిన మండలంలోని ప్రాంతాలపై పూర్తి అవగాహన కలిగి ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.
దర్యాప్తు పూర్తిచేసి చార్జిషీట్ దాఖలు చేసినప్పుడే నేరాలు తగ్గుముఖం పడుతాయని తెలిపారు. ఈ ఏడాది చివరికి 30 శాతం ప్రమాదాలను తగ్గించడమే ప్రధాన లక్ష్యం గా విధులను నిర్వర్తించాలని సూచించారు. ఆరు నెలల్లో జరిగిన రోడ్డు ప్రమాదాలు, నేరాలు, సైబర్ క్రైమ్ నమోదైన కేసులు, పరిశోధించిన కేసులు, సాంకేతిక వినియోగించుకునే విధానం, డ్రంక్ అండ్ డ్రైవ్, ఈ పెట్టికేసులు, ఆర్థిక నేరాలు, తదితర అంశాలపై పోలీసులతో చర్చించారు. గత నెల లో 16 వర్టికల్స్‌లో ఉత్తమ ప్రతిభ చూపిన 35 మంది సిబ్బందికి ప్రశంసా పత్రాలను అందజేశా రు. అదనపు ఏఎస్పీ ఎస్ శ్రీనివాసరావు, డీఎస్సీలు వీ ఉమేందర్, పోతారం శ్రీనివాస్, సీఐలు ఆర్ఐ సీఐలు, ఎస్ఐలు, డీసీఆర్బీ, స్పెషల్ బ్రాంచ్, ఐటీకోర్, సిబ్బంది ఉన్నారు.