ఆదిలాబాద్, జూన్ 3(నమస్తే తెలంగాణ) : వర్షాకాలం నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తు చర్యల్లో భాగంగా మూడుల రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా లబ్ధిదారులకు అవసరమయ్యే బియ్యాన్ని ఎంఎల్ఎస్ పాయింట్లలో నిల్వ చేసిన రేషన్ దుకాణాలకు పంపిణీ చేశారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 356 రేషన్ దుకాణాలు ఉండగా.. 1,92,757 రేషన్‌కార్డులు ఉన్నాయి.
మూడు నెలల పంపిణీలో భాగంగా ప్రభుత్వం 12,600 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పంపిణీ చేసింది. జిల్లాలో జూన్ 2 నుంచి బియ్యం పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెల 30 వరకు డీలర్లు లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేయనున్నారు. బియ్యం తీసుకునేందుకు లబ్ధిదారులు రేషన్ దుకాణాల ఎదుట పడిగాపులు కాయాల్సి వస్తుంది.
మూడు నెలల బియ్యం కోసం యంత్రంపై ఆరు సార్లు వేలిముద్ర ఉంచాల్సి వస్తుంది. దీంతో పంపిణీలో తీవ్రజాప్యం జరుగుతుండడంతో లబ్ధిదారులు దుకాణాల ఎదుట నిల్చోవాల్సి వస్తుంది. గత నెల వరకు కుటుంబంలో ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున అందించేవారు. ఒకసారి వేలిముద్ర పెడితే సరిపోయేది. లబ్ధిదారులు 15 నిమిషాల్లో బియ్యం తీసుకుని పోయేవారు. ఇప్పుడు బియ్యం తీసుకునేందుకు ఎక్కువ సమయం పడుతుంది.