మంచిర్యాల, డిసెంబర్ 24(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కేసీఆర్ సర్కారు రైతుబంధు రూపంలో ఇచ్చిన పంట పెట్టుబడి సాయాన్ని రైతు భరోసా పేరిట ఇస్తామంటూ ఎన్నికల ముందు చెప్పిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చి యేడాదైనా ఆ ఊసెత్తడం లేదు. ఎకరానికి రూ.15 వేల చొప్పున ఇస్తామంటే పెట్టుబడి సాయం పెరుగుతుందని రైతులు ఆశపడ్డారు. కానీ.. ఇచ్చే మొత్తం పెంచినట్టే పెంచి నిబంధనల పేరిట సగానికి కంటే ఎక్కువ మంది రైతులకు రైతు భరోసా ఎగ్గొట్టేందుకు కుట్ర చేస్తుందని రాజకీయ, వ్యవసాయరంగ నిపుణులు చెప్తున్నారు. అసెంబ్లీ సమావేశాలు నిరవదిక వాయిదా పడే రోజు స్వల్పకాలిక చర్చ పెట్టి విధివిధానాలు ఏంటో చెప్పకుండానే ముగిం చేశారు. కాకపోతే ఈ చర్చలో కేంద్ర ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయంగా అమలు చేస్తున్న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి నిబంధనలను అసెంబ్లీలో పెట్టారు. దీంతో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద లబ్ధిపొందున్న రైతులకు మాత్రమే రైతు భరోసా వస్తుందనే చర్చ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. అదే జరిగితే రాష్ట్రంలో 40 లక్షల మంది రైతులు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 3.44 లక్షల మంది రైతులు రైతు భరోసాకు దూరమవుతారని ప్రస్తుత గణాంకాలు చెప్తున్నాయి
నిబంధనల పేరిట కోత
నిబంధనల పేరిట రుణమాఫీ ఇవ్వకుండా రైతులకు మొండిచేయి చూపించారో.. అదే తరహాలో రైతు భరోసా పథకాన్ని కొందరికీ వర్తింప చేస్తారని సమాచారం. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి నిబంధనలే రైతు భరోసాకు వర్తింప చేస్తే దాదాపు గతంలో 70 లక్షల మందికి ఇచ్చిన రైతుబంధు 30 లక్షల మందికి ఇస్తే సరిపోతుంది. ప్రతి సీజన్‌కు అప్పుడు రూ.15 వేల కోట్లు ఖర్చుపెడితే ఇప్పుడు కేవలం సీజన్‌కు 5 వేల కోట్ల లోపు ఇస్తే సరిపోతుదని భావిస్తున్నది. ఈ విషయాన్ని నేరుగా చెప్పలేక సీఎం రేవంత్‌రెడ్డి గుట్టలు, బండరాళ్లు, రోడ్లకు రైతుబంధు ఇచ్చారంటూ ముందే కవర్ చేసుకున్నారని.. తాము చేసే మోసాన్ని కప్పిపుచ్చి ప్రతిపక్షంపై విమర్శలతో సరిపెట్టారని విశ్లేషకులు చెప్తున్నారు. ఈ లెక్కన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 6.19 లక్షల మందికి రావాల్సిన పెట్టుబడి సాయం 2.74 లక్షల మందికి మాత్రమే వస్తుందని అంచనా వేస్తున్నారు. పీఎం కిసాన్ నిబంధనలు అమలు చేస్తే ఇంట్లో ఒక్క రైతుకు మాత్రమే పెట్టుబడి సాయం వస్తుంది. ఇంట్లో ఇద్దరి ముగ్గురి పేరుపై భూమి ఉంటే అందులో ఒక్కరికే రైతు భరోసా ఇస్తారు. రుణమాఫీ మాదిరిగానే కనీసం రెండేండ్లు ఐటీ కట్టిన వారికి రైతు భరోసా రాదు. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, డాక్టర్లు, ఇంజినీర్లు, లాయర్లు, చార్టర్డ్ అకౌంటెంట్లు, అర్కిటెక్ట్స్, ఇతర ప్రొఫెషన్సల్స్లో ఉన్నవారెవరికీ రైతు భరోసా రాకుండా పోతుంది.
యాసంగి పంట వేయనోళ్లకు కోతే..
వానకాలంలో సాగు చేసి యాసంగిలో సాగు చేయని భూములకు రైతు భరోసా ఇవ్వరనే చర్చ వినిపిస్తున్నది. ఎందుకంటే వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ఇటీవల శాసనసభలో అందించిన వివరాల్లో యాసంగిలో సాగు చేయని భూములను సాగులో లేని భూముల కింద చూపించారు. ఇదే జరిగితే రైతు భరోసాకు అర్హులయ్యే రైతులు సంఖ్య ప్రస్తుతం ఉన్న దానిలో 30 శాతానికి పడిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని నిపుణులు అంటున్నారు. అరకొర రుణమాఫీ చేసి అర్హులైన వారికి ఎందుకు రాలేదంటే చేతులు ఎత్తేసిన కాంగ్రెసోళ్లు.. రైతు భరోసా పేరిట మరోసారి మోసం చేసేందుకు వస్తున్నారని రైతులు, రైతు సంఘాల నాయకులు మండిపడుతున్నారు. కేసీఆర్ సర్కార్‌లో ఉమ్మడి జిల్లాలో 6.19 లక్షల మంది రైతులకు ప్రతి సీజన్లో రూ.880.34 కోట్లు ఇచ్చింది. అదే తరహాలో కాంగ్రెస్ ప్రభుత్వం అందరికీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
అందరికీ రైతు భరోసా ఇవ్వాలి..
రుణమాఫీ అని చెప్పి కొందరు రైతులకు చేయనేలేదు. ఎందుకు చేయలేదంటే సాంకేతిక కారణాలు అంటున్నారు. ఇప్పటికీ అన్ని రకాలుగా అర్హులైన రైతులకు మాఫీ అవుతుందో లేదో స్పష్టత లేదు. ఇలాంటి పరిస్థితుల్లో రైతు భరోసా కూడా కొందరికే వస్తుందని వార్త కథనాలు వస్తున్నాయి. నాకు తెలిసి రైతుల్లో సగం మందికి పీఎం కిసాస్ కింద డబ్బులు వస్తలేవు. కానీ రైతు బంధు వచ్చింది. ఇప్పుడు వారందరికీ రైతు భరోసా కూడా ఇవ్వమనడం సరికాదు. రైతుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించాలి. కేసీఆర్ ప్రభుత్వం రైతుబంధు ఇచ్చినట్లే రైతులందరికీ రైతు భరోసా అందేలా చూడాలి.
– అర్నె సమ్మయ్య పటేల్, చెన్నూర్ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్.
జిల్లాలో రైతుబంధు, పీఎం కిసాస్ లబ్ధిదారుల వివరాలు..