ఆదిలాబాద్, జూన్ 10(నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ జిల్లాకు తలమానికంగా నిలిచిన మూతపడిన సిమెంటు పరిశ్రమ కూల్చివేత పనులు మమ్మరంగా కొనసాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం పరిశ్రమలో ఇనుము(స్క్రాప్)ను టెండర్ నిర్వహించగా రూ.42 కోట్లకు దక్కించుకున్న కంపెనీ కూల్చివేత పనులను వేగంగా చేపడుతున్నది. యంత్రాలు తుప్పుపట్టడంతో వాటిని తీసుకుపోవడానికి భారీ భవనాలను కూల్చివేస్తున్నారు. 100 మీటర్ల ఎత్తులో ఉన్న భారీ ప్యాకింగ్ ప్లాంట్‌ను కూల్చివేశారు. పరిశ్రమతోపాటు బ్యాంకు భవనం, తపాలశాఖ, ఉద్యోగుల నివాసగృహాలను కూల్చివేస్తూ వాటిలోని ఇనుమును తీసుకుంటున్నారు. పనులు జరుగుతున్నందున ఎవరినీ లోనికి అనుమతించకుండా పహారా ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన సిమెంటు కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ)ను తిరిగి ప్రారంభించాలంటూ అఖిలపక్షం నాయకులు, ఉద్యోగులు ఆందోళనలు చేసినా ఫలితం లేకుండా పోయింది.
ఇచ్చిన హామీలు మరిచారు..
ఆదిలాబాద్‌లో 1962లో ప్రారంభమైన సీసీఐ మొదట్లో మంచి లాభాల్లో నడిచింది. తర్వాత క్రమంగా నష్టాల బాట పట్టి 1992లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన ఆర్థిక సంస్కరణలతో ఉత్పత్తి నిలిచి మూతపడి స్థితికి చేరుకున్నది. సిమెంటు పరిశ్రమను పునఃప్రారంభించడానికి అవసరమైన వనరులు ఉన్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం ఫలితంగా తిరిగి ప్రారంభంకాలేదు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతోపాటు ఇతర మంత్రులు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సీసీఐని ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. 5 వేల మందికి ఉపాధి కల్పించే సీసీఐని ప్రారంభించాలంటూ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, భూ నిర్వాసితులు అఖిలపక్షంగా ఏర్పడి ఆందోళనలు చేపట్టినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. పైగా తుక్కును వేలం వేయడంతోపాటు పరిశ్రమ కూల్చివేత పనులు చేపట్టింది. మంగళవారం జేసీబీలతో ప్లాంటు పిల్లర్లను తొలగించడంతో కూలింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం ఫలితంగా ఆదిలాబాద్ సీసీఐ చరిత్రగానే మిగిలిపోనున్నదని జనం చర్చించుకుంటున్నారు.