ఎదులాపురం, మే 9 : రాజీవ్ యువ వికాసం పథకం కింద రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ యువత హార్డ్ కాపీలను పరిశీలించి బ్యాంకులకు జాబితాను పంపాలని ఆదిలాబాద్ కలెక్టర్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం గూగుల్ మీట్ ద్వారా సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ లబ్ధిదారులకు వేగంగా సేవలు అందేలా చూడాలన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తూ పారదర్శకంగా ఎంపిక ప్రక్రియ చేపట్టాలన్నారు.డెస్క్, బ్యాంక్ స్థాయిలో వెరిఫికేషన్ ఈ నెల 12 లోగా పూర్తి చేసి, 13 నుంచి 19 వరకు మండల స్థాయిలో సమావేశాలు నిర్వహించాలని తెలిపారు. అనంతరం కార్పొరేషన్ల వారీగా జాబితాలను సిద్ధం చేసి 26లోగా జిల్లా స్థాయి వెరిఫికేషన్ ముగించుకుని 29లోగా జిల్లా మీటింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
రాజీవ్ యువ వికాసం దరఖాస్తులు జిల్లాలో మొత్తం 48,175 అందగా ఇప్పటి వరకు 38,911 దరఖాస్తులు వెరిఫికేషన్ చేసి బ్యాంకులకు ఎక్సెల్ షీట్ల రూపంలో పంపినట్లు అధికారుల నివేదికలో పేర్కొన్నారు. మిగిలిన 27,496 దరఖాస్తుల పరిశీలన ప్రక్రియలో ఉందని వివరించారు. మండల, గ్రామాల వారీగా వచ్చిన దరఖాస్తులను పారదర్శకంగా పరిశీలించాలని సూచించారు. 2025 ఏప్రిల్ 6న ప్రారంభమైన రాజీవ్‌యువ వికాసం పథకం ద్వారా స్వయం ఉపాధి వ్యాపారాల కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ యువతకు రూ.3 లక్షల రుణాలు , 60 నుంచి 80 శాతం వరకు సబ్సిడీ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ నెల 30లోగా కమిటీ ఆమోదించి మంత్రికి నివేదికలు పంపించి జూన్ 2న ఎంపిక చేసిన లబ్ధిదారులకు మంజూరు పత్రాలు ఇవ్వనున్నారు.ఈ సందర్భంగా బ్యాంకర్లు 3, 4 కేటగిరిల్లో ఉన్న దరఖాస్తుల సిబిల్ సోర్లు తప్పనిసరిగా పరిశీలించాలని సూచించారు. అధికారులెవ్వరూ ఎంపిక ప్రక్రియలో లోటుపాట్లకు తావివ్వకూడదని స్పష్టం చేశారు. గూగుల్ మీట్లో ఐటీడీఏ పీవో ఖుష్బూగుప్తా, డీఆర్డీవో, బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ అధికారులు, లీడ్ బ్యాంక్ మేనేజర్, వివిధ బ్యాంకుల మేనేజర్లు, ఎంపీడీవోలు, ఎంపీవోలు , తదితరులు పాల్గొన్నారు.
ఎదులాపురం, మే 9: అస్పరేషనల్ బ్లాక్ ప్రోగ్రాంలో భాగంగా నార్నూర్‌లో అభివృద్ధి పనులపై కలెక్టర్ రాజర్షి షా శుక్రవారం ఆదిలాబాద్ కలెక్టరేట్లో డీఆర్డీవో, సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నార్నూర్ బ్లాక్ డెవలప్మెంట్ కోసం నీతి ఆయోగ్ వాటర్ పునరుద్ధరణ ప్రాజెక్ట్‌లో భాగంగా చెరువుల పూడికతీత పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. మండలంలోని 14 గ్రామాల్లో బాలన్‌పూర్, నార్నూర్, గంగాపూర్ ట్యాంక్-1, ట్యాంక్ -2లో పనులు ఇప్పటికే కొనసాగుతున్నాయని, మిగిలిన ప్రాంతాల్లో 2, 3 రోజుల్లో ప్రారంభం కానున్నాయని పేర్కొన్నారు. స్వచ్ఛ భారత్ మిషన్ కింద నార్నూర్ మండలంలోని గ్రామాల్లో ఐహెచ్హెచ్ఎల్ పథకం ద్వారా మరుగుదొడ్ల నిర్మాణాలను లక్ష్యాలను శాతం వందకు చేరేలా పూర్తి చేయాలని డీఆర్డీవోను ఆదేశించారు. వివిధ అంశాలలో ఇచ్చిన లక్ష్యాలను సాధించాలని, వర్షాకాలం రాకముందు క్రిటికల్ హాబిటేషన్ల్లో పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్డీవో రవీందర్, బీఏఐఎఫ్ ఎన్జీవో ప్రతినిధులు సాయి, సుధాకర్, రాకేశ్, డీడబ్ల్యూవో, ఈఈపీఆర్, ఎంపీవో, ఏపీవో పాల్గొన్నారు.