ఎదులాపురం, ఆగస్టు 1 : కేసుల దర్యాప్తును నాణ్యంగా నిర్వహించి బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని, నేరస్తులకు శిక్షలు పడేలా దర్యాప్తు అధికారులు సమర్థంగా వ్యవహరించాలని ఎస్సీ, ఎస్టీ కో ర్టు ప్రత్యేక న్యాయమూర్తి బీసీ శశీ కుమార్ సూచించారు. శనివారం ఆదిలాబాద్ జిల్లా కోర్టులో జిల్లా పోలీసు చార్జిషీట్ అధికారులతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి మాట్లాడుతూ.. కేసు నమోదైన వెంటనే శాస్త్రీయంగా దర్యాప్తు చేపట్టి, ఘటన స్థలం లో ప్రత్యక్ష సాక్ష్యాలను సేకరించాలని సూచించారు.
దర్యాప్తులో ఎలాంటి లోపాలు లేకుండా నిర్దేశిత గడువులో చార్జిషీట్ దాఖలు చేసి, విచారణ సమయంలో సాక్షులను సకాలంలో కోర్టుకు హాజరుపరచడం ద్వారా నేరం రుజువై నిందితులకు శిక్షలు పడేలా కృషి చేయాలని తెలిపారు. అనంతరం జిల్లాలోని ఏసీపీ, డీఎస్పీ స్థాయి అధికారులతో సమావేశమై దర్యాప్తులో ఎదురవుతున్న సమస్యలను తెలుసుకొని సూచనలు చేశారు. ఈ సమావేశంలో ప్రత్యేక పీపీ రమణరెడ్డి, అదనపు ఎస్పీ సురేందర్‌రావు, డీఎస్పీ ఎల్.జీవన్‌రెడ్డి, మంచిర్యాల ఏసీపీ ప్రకాశ్, ఆసిఫాబాద్ డీఎస్పీ వి.కిరణ్‌కుమార్, ఉట్నూర్ డీఎస్పీ రమేశ్, కోర్టు లైజన్ అధికారులు గంగాసింగ్, పండరి, రవీందర్‌సింగ్, ఏఎస్సై రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు.