AA 23 | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లేలా వరుసగా భారీ ప్రాజెక్టులను లైన్లో పెడుతున్నారు. ‘పుష్ప’ తర్వాత దేశవ్యాప్తంగా తన మార్కెట్‌ను మరింత విస్తరించుకున్న బన్నీ.. ఇప్పుడు కథల ఎంపికలోనూ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన చేయబోయే సినిమాల్లో అత్యంత ఆసక్తిని రేకెత్తిస్తున్న ప్రాజెక్టుల్లో దర్శకుడు లోకేష్ కనగరాజ్‌తో చేయనున్న చిత్రం ఒకటి.అల్లు అర్జున్ కెరీర్లో 23వ సినిమాగా ఈ ప్రాజెక్ట్‌ను గతంలోనే అధికారికంగా ప్రకటించారు. అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచి ఈ సినిమా కథ, నేపథ్యం, యాక్షన్ ఎలిమెంట్స్ ఎలా ఉండబోతున్నాయనే దానిపై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా లోకేష్ కనగరాజ్ తన సినిమాలతో ప్రత్యేకమైన యాక్షన్ ప్రపంచాన్ని సృష్టిస్తుండటంతో.. బన్నీతో ఆయన కలయిక ఎలా ఉండబోతుందో చూడాలని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అయితే తాజాగా ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అల్లు అర్జున్–లోకేష్ కనగరాజ్ సినిమా నిలిచిపోయిందంటూ ప్రచారం మొదలైంది. దీంతో బన్నీ అభిమానుల్లో కూడా కొంత అయోమయం నెలకొంది. అయితే ప్రస్తుతానికి ఈ సినిమా ఆగిపోయిందన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్ విషయంలో ఓ కీలక అంశం ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. లోకేష్ కనగరాజ్ ఇంకా అల్లు అర్జున్‌కు సినిమాకు సంబంధించిన పూర్తి స్థాయి కథను వివరించాల్సి ఉందని సమాచారం. పూర్తి కథ, పాత్రల స్వరూపం, సినిమా స్కేల్, యాక్షన్ అంశాలపై క్లారిటీ వచ్చిన తర్వాతే ప్రాజెక్ట్‌ను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే దానిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
అల్లు అర్జున్ ప్రస్తుతం తన సినిమాల విషయంలో ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం లేదని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దర్శకుడు ఎంత పెద్ద స్టార్ అయినా, ఎంత క్రేజ్ ఉన్న ఫిల్మ్‌మేకర్ అయినా.. కథ, స్క్రీన్‌ప్లే, తన పాత్ర విషయంలో పూర్తి నమ్మకం వచ్చిన తర్వాతే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం బన్నీకి అలవాటుగా మారిందని అంటున్నారు. ‘పుష్ప’తో పాన్ ఇండియా స్థాయిలో భారీ విజయాన్ని అందుకున్న తర్వాత ఆయనపై అంచనాలు మరింత పెరిగాయి. అందుకే తదుపరి సినిమాల విషయంలో మరింత జాగ్రత్తగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే కారణంగా లోకేష్ కనగరాజ్ ప్రాజెక్ట్ విషయంలోనూ పూర్తి స్థాయి కథ వినకుండా ముందుకు వెళ్లేందుకు బన్నీ ఆసక్తి చూపడం లేదనే ప్రచారం జరుగుతోంది. చూడాలి మరి రానున్న రోజులలో ఏం జరుగుతుందో..!