Thorrur | తొర్రూరు రూరల్, అక్టోబర్ 6: ప్రభుత్వ సేవలను ప్రజలకు సులభంగా అందించాల్సిన రెవెన్యూ శాఖ అధికారుల తీరుపై మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కులం, ఆదాయం, నివాస ధ్రువీకరణ పత్రాలతోపాటు ఫ్యామిలీ సర్టిఫికెట్ల జారీకి అనధికారికంగా డబ్బులు వసూలు చేస్తున్నారంటూ పలువురు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై హరిపిరాల గ్రామస్తులు తొర్రూరు తహసీల్దార్ గడిల శ్రీనివాస్‌కు వినతిపత్రం అందజేశారు.
గ్రామస్తుల ఆరోపణల ప్రకారం.. కులం, ఆదాయం, నివాస ధ్రువీకరణ పత్రాల కోసం రూ.వెయ్యి నుంచి రూ.3 వేల వరకు, ఫ్యామిలీ సర్టిఫికెట్ల కోసం రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు డబ్బులు అడుగుతున్నారని పేర్కొన్నారు. మీ సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకున్నా వివిధ కారణాలతో తిరస్కరించడం, అనంతరం సంబంధిత కార్యాలయాలను ఆశ్రయిస్తే డబ్బులు చెల్లించిన తర్వాత పనులు పూర్తవుతున్నాయని వాపోయారు. కొన్ని సందర్భాల్లో సర్టిఫికెట్లపై సంతకాల కోసం కూడా డబ్బులు అడుగుతున్నారని ఆరోపించారు.
హరిపిరాల, కర్కాల గ్రామాలకు జీపీఓగా పనిచేస్తున్న గాదరబోయిన అచ్చయ్యపై గతంలోనూ ఫిర్యాదులు వచ్చినట్లు గ్రామస్థులు తెలిపారు. తాజాగా హరిపిరాల గ్రామస్థులు ఆయనను మార్చాలని కోరుతూ తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. అర్హత ఉన్నప్పటికీ దరఖాస్తులను తిరస్కరించడం, ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పడం, అనంతరం డబ్బులు తీసుకుంటున్నారనే ఆరోపణలపై విచారణ చేపట్టాలని కోరారు.
హరిపిరాల గ్రామానికి చెందిన మిట్టకోల అశోక్ తనకు ఎదురైన అనుభవాన్ని వివరించారు. తన పెద్దనాన్న మిట్టకోలా నారాయణకు సంబంధించిన స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అవసరమైన ధ్రువీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసినట్లు తెలిపారు. ఈ ప్రక్రియలో రూ.2 వేలు తీసుకున్నారని, అనంతరం ఫోన్‌పే ద్వారా మరో రూ.వెయ్యి పంపించినట్లు చెప్పారు. అయినప్పటికీ ఇప్పటివరకు ఫ్యామిలీ సర్టిఫికెట్ జారీ కాలేదని పేర్కొన్నారు. సమస్యను పరిష్కరించి సర్టిఫికెట్ ఇప్పించాలని ఉన్నతాధికారులను కోరారు.
జీపీఓ గాదరబోయిన అచ్చయ్యపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిస్తామని తొర్రూరు తహసీల్దార్ గడిల శ్రీనివాస్ తెలిపారు. గతంలోనూ ఆయనపై ఫిర్యాదులు తన దృష్టికి వచ్చినట్లు చెప్పారు. ప్రభుత్వ సేవల విషయంలో అక్రమాలకు, అవకతవకలకు తావు లేదని స్పష్టం చేశారు. ప్రజల నుంచి అనధికారికంగా డబ్బులు వసూలు చేసినట్లు విచారణలో తేలితే నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ ఆరోపణలపై జిల్లా ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేపట్టి వాస్తవాలను వెలుగులోకి తేవాలని గ్రామస్థులు కోరుతున్నారు. ఆరోపణలు నిర్ధారణ అయితే బాధ్యులపై చర్యలు తీసుకోవడంతోపాటు హరిపిరాల జీపీఓను మార్చాలని డిమాండ్ చేస్తున్నారు.