లక్షెట్టిపేట, సెప్టెంబర్ 11: లక్షెట్టిపేట మున్సిపాలిటీలోని ప్రతి వార్డులో పారిశుధ్య పనులను పకడ్బందీగా నిర్వహించాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. లక్షెట్టిపేట మున్సిపల్ కార్యాలయాన్ని బుధవారం ఆయన తనిఖీ చేశారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ కల్లెడ రాజశేఖర్, అధికారులతో పారిశుధ్య పనులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ప్రతి వార్డులో చెత్తా చెదారంతో పాటు మురుగునీరు నిలువ ఉండకుండా చూడాలన్నారు. రహదారులు డ్రైనేజీలను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ బ్లీచింగ్ వేయాలన్నారు. మురుగునీరు నిల్వ ఉన్న చోట్ల దోమల నివారణకు ఆయిల్ బాల్స్ వేయాలని, వ్యాధుల నివారణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆరోగ్యశాఖ, అంగన్వాడీ, ఆయా కార్యకర్తల సమన్వయంతో ఇంటింటా సర్వే చేపట్టి జ్వర అనుమానితులను గుర్తించి వైద్య సేవలు అందజేస్తూ తగు చర్యలు తీసుకోవాలన్నారు.