నిర్మల్, నవంబర్ 9(నమస్తే తెలంగాణ) : సాగునీటి రంగానికి బీఆర్ఎస్ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది. ప్రాజెక్టులకు కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేసింది. ఇందులో భాగంగానే నిర్మల్ జిల్లా మామడ మండలంలోని పొన్కల్ వద్ద సదర్మాట్ బ్యారేజీని బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించింది. ఇందుకోసం రూ.520 కోట్లు విడుదల చేయగా, దాదాపు 90 శాతానికి పైగా పనులు కేసీఆర్ పాలనలోనే పూర్తయ్యాయి. కేవలం కొంతమేర సివిల్ పనులతోపాటు విద్యుదీకరణ పనులు మాత్రం మొదలు కాలేదు. దీంతో కేసీఆర్ ప్రభుత్వం విద్యుదీకరణ పనులకు సంబంధించి రూ.15 కోట్లతో ప్రతిపాదనలను రూపొందించడమే కాకుండా అవసరమైన మేరకు నిధులు మంజూరు చేస్తున్నట్లు ఉత్తర్వులు వెలువరించింది.
ఇంతలోనే అసెంబ్లీ ఎన్నికలు రావడం, ప్రభుత్వం మారడంతో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నిధుల విడుదల చేయడంలో నిర్లక్ష్యం చేసింది. దీంతో గతేడాదే పూర్తి కావాల్సిన పనులు ఆలస్యమయ్యాయి. ప్రాజెక్టు కింద గల ఆయకట్టు రైతులకు సాగునీటి కోసం ఎదురు చూపులు తప్పలేదు. స్థానిక నాయకులు, రైతుల ఒత్తిడి మేరకు మిగిలిపోయిన పనులు చేపట్టేందుకు ప్రస్తుత ప్రభుత్వం ఇటీవల నిధులు విడుదల చేసింది. దీంతో బ్యారేజీ వద్ద చివరి దశ పనులు కొనసాగుతున్నాయి. వచ్చే యాసంగి నుంచి సాగు నీరందించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. దీనికి సంబంధించి నీటి పారుదల శాఖ అధికారులు అవసరమైన అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు.
ముఖ్యంగా గోదావరి నుంచి వచ్చే నీటిని సదర్మాట్ బ్యారేజీ వద్ద నిలుపుదల చేసేందుకు ఇరిగేషన్ శాఖ అధికారులు ఎన్డీఎస్ఏ (నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ) అనుమతిని కోరుతూ లేఖ రాశారు. ఈ యాసంగికి ముందే అన్ని రకాల అనుమతులు సాధించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం రూ.15 కోట్లతో చేపట్టిన విద్యుదీకరణ పనులు వేగంగా సాగుతున్నాయి. డిసెంబర్ లోగా ప్రాజెక్టుకు సంబంధించిన పెండింగ్ పనులు పూర్తవుతాయిని అధికారులు చెబుతున్నారు. ఎన్డీఎస్ఏ నుంచి అనుమతి రాగానే బ్యారేజీ వద్ద నిల్వ చేసిన నీటిని యాసంగికి విడుదల చేయాలని భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టు కింద మొత్తం 18 వేల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరందనున్నది. నిర్మల్ జిల్లాలో 13,120 ఎకరాలు, జగిత్యాల జిల్లాలో మరో ఐదు వేల ఎకరాలకు ఈ ప్రాజెక్టు ద్వారా ప్రయోజనం కలుగనున్నది. ప్రాజెక్టు పనులను చేపట్టిన ఏజెన్సీకి కేసీఆర్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు బిల్లులను చెల్లించడంతో పనులు వేగంగా పూర్తయ్యాయి.
కేసీఆర్ హయాంలో చకచక పనులు
రైతులకు సాగునీరందించాలన్న ఆశయంతో చేపట్టిన సదర్మాట్ ప్రాజెక్టు నిర్మాణాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. భూ సేకరణ నుంచి మొదలుకొని పనులు పూర్తయ్యే వరకు మహాయజ్ఞంలా చేపట్టింది. ఇందులో భాగంగానే ప్రాజెక్టు వద్ద పెద్ద ఎత్తున కాంక్రీటు పనులతో పాటు క్రస్ట్ గేట్ల బిగింపు పనులను నిర్ధేశిత గడువులోగా పూర్తి చేసింది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి 1176 ఎకరాలు సేకరించాలని నిర్ణయించగా, ఇందులో ఇంకా 55 ఎకరాల భూ సేకరణ పెండింగ్లో ఉన్నది. సేకరించిన భూములకు సంబంధించి దాదాపు రూ.116 కోట్ల పరిహారాన్ని రైతులకు అందజేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పరిహారాన్ని గణనీయంగా పెంచిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఎకరాకు రూ.10 లక్షల చొప్పున అందజేసింది. ఎట్టకేలకు ప్రాజెక్టు పనులు చివరి దశకు చేరుకోవడంతో ఆయకట్టు రైతుల్లో ఆనందం వ్యక్తమవుతున్నది. ప్రస్తుతం కొనసాగుతున్న విద్యుదీకరణ పనులు పూర్తి కాగానే వచ్చే యాసంగిలో సాగునీటిని విడుదల చేసేందుకు అధికారులు కృషి చేస్తున్నారు.
కేసీఆర్ కృషి వల్లనే సాధ్యమైంది..
కేసీఆర్ కృషి వల్లనే పొన్కల్ వద్ద గోదావరిపై సదర్మాట్ బ్యారేజీ నిర్మాణం సాధ్యమైంది. బ్రిటీష్ కాలంలో గోదావరిలో నిర్మించిన సదర్మాట్ ఆనకట్ట ద్వారా ఇన్నేళ్లుగా ఇక్కడి రైతులకు సాగునీరు అందింది. అయితే ఇప్పటి వరకు వానకాలం పంటకు మాత్రమే గ్యారెంటీ ఉండేది. పొన్కల్ వద్ద నిర్మించిన ప్రాజెక్టు ప్రారంభమైతే ఇకపై రెండు పంటలకు ఢోకా ఉండదు. నాకు ఖానాపూర్ శివారులో సదర్మాట్ కాలువ కింద రెండెకరాల వ్యవసాయ భూమి ఉంది. యేటా ఎండాకాలంలో చివరి ఆయకట్టుకు నీరందేది కాదు.
పాత ఆనకట్ట నిర్మించిన స్థలం గోదావరిలోని ఒక పాయలో ఉండడం వల్ల నీరు ఎక్కువగా నిలువ ఉండేది కాదు. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన ప్రాజెక్టు స్థలం గోదావరి రెండు పాయలుగా విడిపోక ముందే పొన్కల్ వద్ద కట్టారు. అక్కడ నీటి నిలువ సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. దీంతో ఖానాపూర్, కడెం మండలాల రైతులకు ఈ ప్రాజెక్టు కింద రెండు పంటల సాగుకు ఇబ్బంది ఉండదు. ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరిక అయిన సదర్మాట్ ప్రాజెక్టును నిర్మించిన అప్పటి సీఎం కేసీఆర్కు ఈ ప్రాంత రైతులు జీవితాంతం రుణపడి ఉంటారు. – పంబాల భీమేశ్, రైతు, ఖానాపూర్