ఆర్టీసీ కార్మికులు యుద్ధం ప్రకటించారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ విలీన బిల్లుకు మోకాలడ్డడంపై ఆగ్రహోదగ్రులయ్యారు.న్యాయ సలహా పేరిట కాలయాపన చేస్తుండడంపై మండిపడ్డారు. కార్మిక సంఘాల పిలుపు మేరకు కార్మికులు, సిబ్బంది శనివారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని డిపోల ఎదుట నిరసన తెలిపారు. మంచిర్యాల, ఆసిఫాబాద్, నిర్మల్, భైంసా, ఆదిలాబాద్, ఉట్నూర్ ఆర్టీసీ డిపోల ఎదుట నల్లబ్యాడ్జీలు ధరించి ధర్నా నిర్వహించారు. ఫలితంగా ఉదయం రెండు గంటలపాటు ఎక్కడికక్కడ బస్సులు నిలిచాయి. ఈ సందర్భంగా కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ కార్మికుల మేలు కోరుతుంటే.. గవర్నర్ తమిళిసై అడ్డుకోని రాజకీయం చేయడం తగదన్నారు. 43 వేల మంది కార్మిక కుటుంబాలతో చెలగాటం ఆడడం సరికాదని పేర్కొన్నారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లో కచ్చితంగా బిల్లు పాస్ కావాలని, లేనిపక్షంలో నిరసన ఉద్యమంగా మారుతుందని హెచ్చరించారు. కాగా.. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాకేంద్రంలోని బ్రాహ్మణవాడకు చెందిన ఆర్టీసీ ఎస్డీఐ బూసి బాపు(50) గుండెపోటుతో మృతిచెందాడు.-
రాష్ట్ర ప్రభుత్వం టీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ, ఉద్యోగులు, కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అడ్డుకట్ట వేస్తున్నారు. గవర్నర్ ఆమోదానికి పంపిన బిల్లును న్యాయసలహా పేరిట పక్కన పెట్టారు. సమున్నతమైన గవర్నర్ హోదాలో ఉండి కార్మికులకు మేలు చేసే బిల్లు విషయంలో రాజకీయాలు చేయడం ఏంటని కార్మికులు మండిపడుతున్నారు. రాష్ట్రంలో 43 వేల మంది కార్మికులు, వారి కుటుంబాలకు బంగారు భవిష్యత్ ఇచ్చే బిల్లును స్వార్థంతో ఆపడం సరికాదని వాపోతున్నారు. గవర్నర్ తీరును నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా శనివారం అన్ని బస్సు డిపోల్లో ఆర్టీసీ కార్మికులు నిరసన తెలిపారు. ఉదయం ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు బస్సులను నిలిపివేశారు. డిపోల్లో నల్ల బ్యాడ్జీలు ధరించి గవర్నర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాజకీయ స్వార్థం కోసం కార్మికుల పొట్ట కొట్టాలని చూస్తే పుట్టగతులు లేకుండా పోతాయంటున్నారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లో కచ్చితంగా బిల్లు పాస్ కావాలని లేనిపక్షంలో నిరసన ఉద్యమంగా మారుతుందని కార్మిక సంఘాల నాయకులు హెచ్చరించారు. ఉమ్మడి జిల్లాలో మంచిర్యాల, ఆసిఫాబాద్, నిర్మల్, భైంసా, ఆదిలాబాద్, ఉట్నూర్ ఆర్టీసీ డిపోల్లో కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. మొత్తం ఆరు డిపోల పరిధిలో కార్మికులు, ఉద్యోగులకు ఒక్కసారిగా నిరసన దిగారు. ఉదయం రెండు గంటలపాటు బస్సులు నడపకుండా ఆపేశారు. బస్టాండ్లు, డిపోల్లో బస్సులన్నీ ఖాళీగా కనిపించాయి. దీంతో ప్రజా రవాణాకు కాస్త ఇబ్బంది కలిగింది. అత్యవసర పనుల కోసం వెళ్లేందుకు వచ్చిన ప్రయాణికులు కొంత అవస్థలు పడ్డారు. ఉదయం 8 గంటల తరువాత బస్సులు యథావిధిగా నడిచాయి.
– మంచిర్యాల, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
కార్మికుల కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు.. కష్టాలు, నష్టాలు తొలగించి బంగారు బాటలు వేసేందుకు ఆర్టీసీని సర్కారులో విలీనం చేయాలని క్యాబినెట్లో తీర్మానం చేశారు. కార్మికుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి గవర్నర్ అనుమతి తప్పనిసరి. బిల్లును రాజ్‌భవన్‌కు పంపిం చింది. బిల్లు పాస్ అయితే జీతభత్యాలు పెరగడంతోపాటు ఉద్యోగ భద్రత లభించనుంది.
– ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ రాష్ట్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ అసెంబ్లీలో ప్రవేశపెట్టకుండా మోకాలడ్డుతు న్నారు.43 వేల మంది కార్మికుల కుటుంబాలతో చెలగాటం ఆడుతున్నా రు. అసెంబ్లీ ముసాయిదా బిల్లును పరిశీలించడానికి సమయం పడుతుందని, న్యాయ సలహా అవసరమని కొర్రీ పెట్టి ఆపేశారు. ప్రైవేట్ యూనివర్సిటీల బిల్లు, మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖలకు చెందిన బిల్లులను కూడా ఆపేశారు.
– గవర్నర్ తమిళి సై సౌందరరాజన్
ఉట్నూర్, ఆగస్టు 5: రాష్ట్ర గవర్నర్ తమిళిసై అడ్డుకుంటున్న బిల్లుతో రాష్ట్రంలోని 43 వేల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. బిల్లును తొందరగా ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ఆమోదించాలి. ఇప్పటికే సంస్థ చాలా నష్టాల్లో ఉంది. సంస్థ భవిష్యత్‌తో ఆడుకోవద్దు. ఆర్టీసీపై తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే ప్రజలు, ఉద్యోగుల నుంచి వ్యతిరేకత తప్పదు. గవర్నర్ తన నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలి. వెంటనే బిల్లుకు ఆమోదం తెలపాలి.
-గబ్బర్‌సింగ్, కండక్టర్, ఉట్నూర్ డిపో
సీఎం కేసీఆర్ ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రకటిం చడం మాలో ఆనందాన్ని నిం పింది. అయితే అంతలోనే మా ఉద్యోగుల సంతోషం గవర్నర్ చర్యతో నీరుగారిపోయింది. గవర్నర్ ఇప్పటికైనా మాపై దయ చూపాలి. లేకపోతే మాకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న మాకు ఇప్పుడు ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం మా కుటుంబాల్లో ఎంతో సంతోషం నింపింది.
– సీహెచ్ రాధిక, కండక్టర్, ఆదిలాబాద్
ఉట్నూర్, ఆగస్టు 5 : టీఎస్ఆర్టీసీని ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకోవడం సరైన నిర్ణయం. దీనిపై తెచ్చిన బిల్లును రాష్ట్ర గవర్నర్ తమిళి సై వెంటనే ఆమోదించాలి. ఇప్పటికే కార్పొరేషన్ చాలా ఇబ్బందుల్లో ఉంది. సంస్థను కాపాడేందుకు సీఎం కేసీఆర్ కృతనిశ్చయంతో ఉన్నారు. రాజకీయాలకు ఇది వేదిక కాదు. రాష్ట్రంలోని 43 వేల కుటుంబాలు ఈ నిర్ణయంతో ముడిపడి ఉన్నాయి. గవర్నర్ మేడం కూడా బిల్లును ఆపొద్దు.
– బీఆర్ కృష్ణ, ఏడీసీ, ఉట్నూర్ డిపో
నిర్మల్ అర్బన్, ఆగస్టు 5 : రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించడం హర్షణీయం. ఈ నిర్ణయంతో ఉద్యోగులంతా సంతోషంగా ఉన్నరు. గతంలో ఏ ఒక్కరూ ఇట్ల మా గురించి ఆలోచించలేదు. ఆర్టీసీని సీఎం కేసీఆర్ పూర్తిగా ఆదుకుంటున్నరు. ఆర్టీసీ విలీన బిల్లును గవర్నర్ వెంటనే ఆమోదించాలి. దసరా పండుగ లోగా ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి.
-రమణ, ఆర్టీసీ ఉద్యోగి
ఉద్యోగులను ఇబ్బంది పెట్టద్దు
భైంసా, ఆగస్టు 5 : ఆర్టీసీ ఉద్యోగులను ఇబ్బంది పెట్టొద్దు. వెంటనే బిల్లును గవర్నర్ ఆమోదించాలి. 43 వేల మంది కార్మికుల కుటుంబాలకు న్యాయం చేసేలా సీఎం కేసీఆర్ మంచి నిర్ణయం తీసుకున్నడు. బడుగు బలహీన వర్గాలే ఆర్టీసీలో ఉద్యోగులుగా పనిచేస్తున్నరు. వారికి సర్కారు మంచి చేయాలనుకుంటున్నది.
– స్వరూప్, ఆర్టీసీ ఉద్యోగి
అడ్డుకోవడం సబబు కాదు
భైంసా, ఆగస్టు 5 : ఆర్టీసీ విలీన బిల్లును గవర్నర్ అడ్డుకోవడం కరెక్ట్ కాదు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ మంచి నిర్ణయం తీసుకున్నరు. ఈ సమావేశాల్లోనే బిల్లు పెడితే గవర్నర్ అడ్డుకోవడం సరికాదు. ఆర్టీసీ ఉద్యోగులంతా సంతోషంగా ఉన్న సమయంలో గవర్నర్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం చాలా బాధ కలిగించింది. ఎందరో ఉద్యోగులకు మేలు చేసేలా తీసుకున్న నిర్ణయాన్ని అడ్డుకోవడం దారుణం.
– అంబాదాస్, ఆర్టీసీ డ్రైవర్
గుండెపోటుతో ఎస్డీఐ మృతి
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాకేంద్రంలోని బ్రాహ్మణవాడకు చెందిన బూసి బాపు(50) ఆర్టీసీ డిపోలో ఎస్డీఐగా విధులు నిర్వహిస్తున్నాడు. గవర్నర్ తమిళి సై తీరును నిరసిస్తూ ధర్నా నిర్వహించగా పాల్గొన్నాడు. విధులు ముగించుకొని మధ్నాహ్నం ఇంటికి వెళ్లిన కొద్ది సేపటికే గుండెపోటుకు గురయ్యాడు. దవాఖానకు తరలిస్తుండగానే మృతిచెందాడు.
గవర్నర్ ఆమోదించాలి..
ఆదిలాబాద్ రూరల్, ఆగస్టు 5 : ప్రజలకు ఎన్నో సేవలందిస్తున్న ఆర్టీసీ ఉద్యోగుల శ్రమను గుర్తించిన సీఎం కేసీఆర్ మా అందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించారు. ఈ ప్రకటనతో వేలాది మంది ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాల్లో పండుగ వాతావరణం నెలకొంది. కానీ.. గవర్నర్ ఈ బిల్లు ఆమోదించికపోవడం చాలా బాధాకరం.. ఇప్పటికైనా గవర్నర్ పెద్ద మనసుతో మా ఆవేదనను అర్థం చేసుకుని మాకు న్యాయం జరిగేటట్లు చూడాలి. – సీ సతీశ్, కండక్టర్, ఆదిలాబాద్.
తీవ్రంగా ఖండిస్తున్నాం..
గర్మిళ్ల, ఆగస్టు 5 : ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలుపక పోవడాన్ని సమస్త ఉద్యోగులమంతా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆర్టీసీ కార్మికుల కల నెరవేరే సమయంలో గవర్నర్ ఆమోదం తెలపకపోవడం చాలా శోచనీయం. ఆర్టీసీ కార్మికులు పడుతున్న ఆవేదన అర్థం చేసుకొని ప్రభుత్వంలో విలీనం చేస్తామనడం ఎంతో సంతోషకరమైన విషయం. రాజకీయ కోణంలో ఆలోచిస్తూ గవర్నర్ బిల్లుపై సంతకం పెట్టకపోవడం ఉద్యోగులను మనోవేదనకు గురిచేస్తున్నది. అవసరమైతే రాజ్‌భవన్‌ను ముట్టడించేందుకు కూడా వెనుకాడబోం. కార్మికులను ఇబ్బంది పెట్టకుండా బిల్లును ఆమోందిచాలి. -శ్రీనివాస రావు, కండక్టర్, మంచిర్యాల .
గవర్నర్ స్పందించాలి..
ఆదిలాబాద్ రూరల్, ఆగస్టు 5 : దశాబ్దాల చరిత్ర గల ఆర్టీసీలో రాష్ట్ర ప్రభుత్వం తాజా నిర్ణయం చరిత్రాత్మకం.. ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తూ నిర్ణయం తీసుకోవడం మామూలు విషయం కాదు. రాష్ట్రం మొత్తంలో వేలాది కుటుంబాలు సంతోషంగా ఉన్న ఈ నేపథ్యంలో రాష్ట్ర గవర్నర్ సహకరించకపోవడం అన్యాయం. చాలీచాలని జీతాలతో సామాన్యులకు సేవలందిస్తున్న ఆర్టీసీ వారితో ఎవరూ ఆటలాడుకోవద్దు.
– ఎస్కే యూసుఫ్, సేఫ్టీ వార్డెన్, ఆదిలాబాద్