నిర్మల్ అర్బన్, జూన్ 16 : ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలపై ఆర్టీసీ దృష్టి సారించిందని, ఇందులో భాగంగా నిర్మల్ బస్టాండ్ ఖాళీ స్థలంలో ఆధునిక హంగులతో వాణిజ్య సముదాయాన్ని నిర్మిస్తున్నట్లు రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో రూ.34.43 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఆర్టీసీ కమర్షియల్ కాంప్లెక్స్‌కు శుక్రవారం ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్‌తో కలిసి మంత్రి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా 1.3 ఎకరాల పట్టణ నడి బొడ్డున గల స్థలంలో 43 వేల స్కేర్వ్ ఫీట్ల విస్తీర్ణంలో అత్యాధునిక హంగులు, మెరుగైన సౌకర్యాలతో కమిర్షియల్ కాంప్లెక్స్‌లను నిర్మిస్తున్నామన్నారు.
ఈ కాంప్లెక్స్‌లో పార్కింగ్ సదుపాయం కోసం సెల్లార్, జీప్లస్ త్రీ నిర్మాణంలో 53 స్టాళ్లు, శుభకార్యాలు నిర్వహించుకునేందుకు ప్రత్యేక హాళ్లు నిర్మిస్తున్నామని తెలిపారు. ప్రయాణికుల సౌకర్యార్థం వెయిటింగ్ హాల్ ఇతర సౌకర్యాలతో పాటు ఎల్సీడీ తెరలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఏడాదిలోగా నిర్మాణం పూర్తయ్యేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని ఆదేశించారు. అనంతరం ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ.. ఆర్టీసీ సంస్థ అభివృద్ధికి ప్రయాణికులు సహకరించాలని కోరారు. ప్రైవేట్ వాహనాలకు స్వస్తి పలికి ఆర్టీసీలోనే ప్రయాణించాలని సూచించారు.
ప్రత్యేక రాష్ట్ర సాధనకోసం 49 వేల మంది ఆర్టీసీ కార్మికుల పోరాటాన్ని గుర్తు చేశారు. నష్టాల్లో ఉన్న సంస్థను, ప్రైవేట్ పరం అయ్యే ఆర్టీసీని సీఎం కేసీఆర్ రూ.1500 కోట్లు బడ్జెట్లో కేటాయించి సంస్థను ఆదుకున్నారని తెలిపారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని గట్టెక్కించేందుకు ఖాళీ స్థలాల్లో కాంప్లెక్స్‌ల నిర్మాణానికి చర్యలు చేపడుతున్నామన్నారు. రాష్ట్రంలో తొలిసారిగా నిర్మల్‌లో షాపింగ్ కాంప్లెక్స్‌ను నిర్మించుకుంటున్నట్లు తెలిపారు. త్వరలో హన్మకొండ, వరంగల్లోనూ నిర్మాణాలు ప్రారంభించుకోనున్నామని చెప్పారు. అనంతరం కాంప్లెక్స్ నిర్మించే స్థలాన్ని పరిశీలించారు.
బస్టాండ్‌లో కలియ తిరిగారు. ప్రయాణికులతో మాట్లాడి సౌకర్యాలపై ఆరా తీశారు. బస్టాండ్ పక్కన ప్రియదర్శినినగర్ వెళ్లే రోడ్డును పరిశీలించారు. ఇరుకైన రహదారితో కాలనీ వాసులు ఇబ్బందులు పడుతున్నారని, దీన్ని దృష్టిలో ఉంచుకొని 40 ఫీట్ల రోడ్డు విస్తరణకు ప్రణాళికలు రూపొందించాలని సంబంధిత అధికారులకు మంత్రి ఆదేశించారు. నిర్మల్‌కు మొదటిసారిగా విచ్చేసిన ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డికి మంత్రి క్యాంపు కార్యాలయంలో ఘన స్వాగతం పలికారు. మంత్రిని, చైర్మన్‌ను ఆర్టీసీ అధికారులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వరుణ్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎర్రవోతు రాజేందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రమణ, ఎఫ్ఎస్సీఎస్ చైర్మన్ ధర్మాజీ రాజేందర్, ప్రముఖ పారిశ్రామికవేత్త అల్లోల మురళీధర్ రెడ్డి, సురేందర్ రెడ్డి, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు మారుగొండ రాము, రాంకిషన్ రెడ్డి, శ్రీకాంత్ యాదవ్, ఆర్ఎం జానిరెడ్డి, డీఎం సాయన్న, ఏఆర్ రెడ్డి, గంగాధర్, రమణ తదితరులు పాల్గొన్నారు.