నిర్మల్, అక్టోబర్ 8(నమస్తే తెలంగాణ) : గోదావరి, దాని ఉపనదుల నీరు వృథా కాకుండా అప్పటి కేసీఆర్ సర్కారు నీటిని ఒడిసి పట్టేందుకు చెక్‌డ్యాంల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. వాగులు, వంకల ద్వారా సముద్రం పాలవుతున్న నీటిని అడ్డుకట్ట వేయడానికి ఎక్కడికక్కడ చెక్‌డ్యాంలను నిర్మించ సంకల్పించింది. ఫలితంగా భూగర్భ జలాలు పెరగడంతోపాటు సాగు, తాగునీటి అవసరాలకు ఇబ్బంది లేకుండా పోయాయి. నిర్మల్ జిల్లాలోని ప్రధాన వాగులపై మొదటి విడుతలో 21 చెక్‌డ్యాంలను నిర్మించిన బీఆర్ఎస్ ప్రభుత్వం.. రెండో విడుతలో మరిన్ని నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది.
ఇందులో భాగంగానే నిర్మల్, ఖానాపూర్, ముథోల్ నియోజకవర్గాల పరిధిలో దాదాపు రూ.100 కోట్లతో 19 చెక్‌డ్యాంలను నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించింది. అవసరమైన ప్రతిపాదనలు ప్రభుత్వానికి కూడా పంపింది. మూడు నియోజకవర్గాల్లోని 5,610 ఎకరాలకు సాగు నీరందించే లక్ష్యంతో ఈ చెక్‌డ్యాంలను ప్రతిపాదించారు. దీనికి స్పందించిన అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.114 కోట్లకు పరిపాలన పరమైన ఆమోదాన్ని తెలుపుతూ నిధులను కూడా మంజూరు చేసింది. ఆయా పనులకు టెండర్ ప్రక్రియ పూర్తి చేసి కాంట్రాక్టర్లకు పనులను అప్పగించడమే కాకుండా, పనులకు శంకుస్థాపన కూడా చేశారు. పనులు మొదలవుతాయని భావిస్తున్న తరుణంలోనే ఎన్నికలు రావడం.. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో పరిస్థితులు తలకిందులయ్యాయి.
అభివృద్ధి పనులను నిలిపివేసిన కాంగ్రెస్ ప్రభుత్వం
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే బీఆర్ఎస్ హయాంలో మంజూరైన అభివృద్ధి పనులను నిలిపివేయాలని అధికారులను ఆదేశించింది. ఇందులో భాగంగానే 19 చెక్‌డ్యాంల పనులను చేపట్టవద్దని, మంజూరైన నిధులను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. దీంతోపాటు అప్పటికే పూర్తయిన టెండర్లను కూడా రద్దు చేయాలని నిర్ణయించింది. అయితే బీఆర్ఎస్ హయాంలో అధికారులు రూపొందించిన అంచనాల కన్నా తక్కువ ధరలతో టెండర్లు దాఖలు కావడం, అలాగే టెండర్లు వేసిన ఏజెన్సీలకు నిర్మాణ రంగంలో మంచి అనుభవం ఉన్న కారణంగా కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి ఈ చెక్‌డ్యాంల నిర్మాణ పనులను పాత ఏజెన్సీలతోనే చేపట్టేందుకు నిర్ణయించింది.
దీనికి అనుగుణంగానే నీటిపారుదల శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆయా నియోజకవర్గాల ముఖ్య నాయకుల ఒత్తిళ్ల కారణంగానే పనులను చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. ఒకవేళ పనులు చేపట్టినా.. రాజకీయ ఒత్తిళ్ల కారణంగా తమకు బిల్లులు వస్తాయో లేదోనన్న సందేహంలో కాంట్రాక్టర్లు ఉన్నారు. రాజకీయ కారణాల వల్లనే దాదాపు రూ.100 కోట్ల పనులు మొదలు కావడం లేదు. ఈ నేపథ్యంలో పనుల ప్రారంభానికి రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని జిల్లావాసులు కోరుతున్నారు.