ఉట్నూర్ ఐటీడీఏ పరిధిలోని ఏజెన్సీ ప్రాంతమైన ఇంద్రవెల్లి మండలంలోని ఆదివాసీ గిరిజన గ్రామాల రోడ్లు గుంతలతో అధ్వానంగా మారాయి. వర్షపు నీరు గుంతల్లో చేరి ప్రమాదకరంగా మారాయి. ఎప్పుడు ఏం జరుగుతుందోనని వాహనదారులు, ప్రయాణికులు ఆందోళనకు గురవుతున్నారు. జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
– ఇంద్రవెల్లి, జూలై 3
ఇంద్రవెల్లి మండలకేంద్రంలోని అంజీచౌక్ నుంచి వాల్గొం డా, బండాపాటగూడ, హీరాపూర్, మారుతిగూడ, లాల్టేక డి, డోంగర్గామ్, కోయల్పాండ్రి, అనంతపూర్, దస్నాపూర్, పిట్టబొంగురం, కెస్లాపూర్ గ్రామాల వరకు గల బీటీరోడ్డుకు అడుగడుగునా గుంతలు ఏర్పడ్డాయి. వాటిలో వర్షపు నీరు చేరి ప్రమాదకరంగా మారాయి. గుంతలను తప్పించుకుంటూ వెళ్లాల్సి వస్తుందని, ఒక గుంతను తప్పిస్తే మరో గుంతలో వాహనాలు పడిపోతున్నాయని ఆటో డ్రైవర్లు, ద్విచక్ర వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని భయంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మండల కేంద్రానికి రావాలంటేనే గంటల తరబడి సమయం పడుతుందని ప్రయణికులు మండిపడుతున్నారు. వర్షాకాలానికి ముందే రోడ్లుకు మరమ్మతులు చేయాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు విన్నవించినా పట్టించుకోలేదని ఇంద్రవెల్లి మండలంలోని పలు గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా రోడ్లు బాగు చేయాలని కోరుతున్నారు.