తాండూర్ : వర్షం వస్తే జలమయం అవుతున్న బోయపల్లి ఎస్సీ కాలనీ (SC Colony) సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కాలనీవాసులు తహసీల్దార్ జ్యోత్స్న, ఎంపీడీవో శ్రీనివాస్‌కు గురువారం వేరువేరుగా స్థానిక నాయకులతో కలిసి వినతిపత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ ప్రతీ సంవత్సరం వర్షాలు కురిసినప్పుడు వరద నీరు ఇండ్లలోకి చేరి తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నామన్నారు. గతంలో ఈ ప్రాంతంలో ఉన్న ఒర్రెను భూమి యజమానులు పూడ్చేశారని అన్నారు. పచ్చిమం వైపున్న కాలువ తిరిగి నిర్మించాలని కోరారు.
వర్షపు నీరు, వరద నీరు, మురుగు కాలువల నీరు జాతీయ రహదారి అధికారుల తప్పిదం వల్ల ఎస్సీ కాలనీ జలమయం అవుతున్నదని ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కాలనీ జలమయం కాకుండా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.