మంచిర్యాలటౌన్, ఆగస్టు 3 : పట్టణంలోని జడ్పీ బాలుర పాఠశాల ప్రహరీని ఆనుకుని నిర్మించిన ఆక్రమణలను శనివారం మున్సిపల్ అధికారులు తొలగిస్తుండగా, అందులో వ్యాపారాలు చేసుకుంటున్న వారంతా ఆందోళనకు దిగారు. ఎన్నో ఏళ్లుగా ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని, ఒక్కసారిగా ఇక్కడి నుంచి తొలగిస్తే తమ బతుకులు ఆగమైపోతాయని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు.
పిల్లాపాపలతో బైఠాయించి తమ దుకాణాలను తొలగించవద్దని మున్సిపల్ అధికారులు, పోలీసులను వారు వేడుకున్నారు. పొక్లెయిన్, ట్రాక్టర్లతో వచ్చిన మున్సిపల్ అధికారులు, సిబ్బంది ఎట్టి పరిస్థితుల్లో ఆక్రమించుకొని వేసిన దుకాణాలను తొలగించాల్సిందేనని తేల్చిచెప్పగా, అందుకు వారు కొంత సమయమివ్వాలని కోరారు.
ఈ మధ్యలో మున్సిపల్ చైర్మన్, కమిషనర్‌తో మాట్లాడాలని చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. వ్యాపారుల ఆందోళనకు బీఆర్ఎస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అంకం నరేశ్, నాయకులు సుంకరి రమేశ్, తాజుద్దీన్, సీపీఐఎంఎల్ నాయకులు లాల్‌కుమార్ మద్దతు పలికారు. వ్యాపారులకు ప్రత్యామ్నాయం చూపించాకే ఇక్కడ నుంచి దుకాణాలను తొలగించాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్‌ను కలిసేందుకు కలెక్టరేట్‌కు బయలుదేరి వెళ్లారు.
కొన్నేళ్ల క్రితమే బస్టాండు పక్కన ఉన్న జడ్పీ బాలుర పాఠశాల ప్రహరీని ఆనుకుని పలువురు చిరువ్యాపారులు ఇనుపరేకులతో తయారుచేసిన షెడ్డులతో దుకాణాలను ఏర్పాటు చేసుకున్నారు. వీటిని తొలగించాలని మున్సిపల్ కౌన్సిల్ నిర్ణయం కూడా తీసుకుంది. ఆ మేరకు ఉన్నతాధికారుల ఆదేశాలతోనే పట్టణంలోని ఆక్రమణలను తొలగిస్తున్నట్లు టౌన్‌ప్లానింగ్ అధికారి సంపత్ తెలిపారు. టీపీఎస్‌లు శ్యాం, రాజ్‌కుమార్, సానిటరీ ఇన్స్పెక్టర్ ఉదయ్‌కిరణ్, సిబ్బంది పాల్గొన్నారు.