నిర్మల్ చైన్గేట్, జూన్ 7 : రోగుల జీవన ప్రమణాన్ని మెరుగుపరచడంతోపాటు క్యాన్సర్ మహమ్మారితో పోరాడే సహజ సామర్థాన్ని పెంచేందుకు వైద్య కళాశాల ఆసుపత్రుల్లో ప్రత్యేకంగా వైద్య సేవలందించేందుకు నిర్మల్ వైద్య కళాశాల ఆసుపత్రిలో 20 పడకల చొప్పున జెరియాట్రిక్ వార్డులు, క్యాన్సర్ కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది.
నిర్మల్ ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పాలియేటివ్ కేర్ కేంద్రం ఏర్పాటయింది. ఇక్కడ క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు చికిత్సలు అందిస్తున్నారు. నిర్మల్ వైద్య కళాశాల ఆసుపత్రిలో జెరియాట్రిక్ వార్డులు, క్యాన్సర్ కేంద్రాలను త్వరలో ప్రారంభం కానున్నాయి. క్యాన్సర్ కేర్ కేంద్రం, పాలియేటివ్ కేర్ పక్షవాతంతోపాటు ఇతర దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ఉపశమనం కలిగించేందుకు ఉపయోగించనున్నారు. ఇందుకు ఆసుపత్రిలో ప్రత్యేకంగా వార్డులు ఏర్పాటు చేశారు. జెరియాట్రిక్ కేంద్రం ఏర్పాటు చేయడం వల్ల ఈ ప్రాంతవాసులకు ప్రయోజనం చేకూరనుంది.
అందుబాటులో సేవలు
వృద్ధాప్యంలో గుండె జబ్బులు, షుగర్, బీపీతోపాటు ఇతర వ్యాధులు ఉండడం వల్ల వీటిని ఎదుర్కోవడం కష్టతరమవుతుంది. అలాంటి వాటికి ప్రత్యేక వార్డుల్లో నైపుణ్యం కలిగిన వైద్యులు(జెరియాట్రిషన్లు) అందుబాటులో ఉండి అవసరమైన చికిత్సలు, మందులు అందిస్తారు. శారీరక, మానసిక, సామాజిక ఆరోగ్య అంశాలను సమగ్రంగా పరిశీలించడం, వృద్ధులు ఎదుర్కొనే సమస్యలను ముందుగా గుర్తించడం, ప్రతిరోగి అవసరాలకు అనుగుణంగా చికిత్స విధానం రూపొందిస్తారు.
ఒంటరితనం, ఒత్తిడి, ఆందోళన వంటి మానసిక సమస్యలకు కౌన్సెలింగ్ ఇస్తారు. జెరియాట్రిక్ వార్డులలో సేవలన్నీ ఒకే చోట లభిస్తాయి. కీమోథెరపీ, రేడియేషన్, కౌన్సిలింగ్ వంటి సేవలు ఒకే చోట లభిస్తాయి. చికిత్సలు రోగులకు అందుబాటులో లభించడం వల్ల దూర ప్రాంతాలకు వెళ్లనవసరం లేదు. సమయం, డబ్బు ఆదా అవుతుంది. క్యాన్సర్ కేంద్రాలలో రోగ నిర్ధారణ, చికిత్స త్వరగా అందే ఆస్కారం ఉంది.