కుమ్రం భీం ఆసిఫాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ) : జైనూర్ సామాజిక ఆరోగ్య కేంద్రంలో పూర్తిస్థాయి వైద్యులు, సిబ్బందిని నియమించాలని ఆదివాసీ సంఘాల నాయకుడు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం జైనూర్ మండలం కేంద్రంలో రాస్తారోకో నిర్వహించారు.
ఎమినిది మంది వైద్యులకుగాను, ఒక్క వైద్యుడే ఉన్నాడని, సిబ్బంది పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయని, పారాసిటమల్ గోలీలు, స్లైన్ బాటిళ్లు సైతం అందుబాటులో లేవని మండిపడ్డారు. ఏజెన్సీలో వైద్యంపై నిర్లక్ష్యం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. రాస్తారోకోతో ఇరువైపులా భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు జోక్యం చేసుకొని ఆందోళన విరమింపజేశారు.
ఆదివాసీ సంఘాల నాయకుడు కనక యాదవ్‌రావు మాట్లాడుతూ సిర్పూర్(యు), లింగాపూర్ మండలాల నుంచి కూడా జైనూర్ సామాజిక ఆరోగ్య కేంద్రానికే వందలాది పేషెంట్లు వస్తారని, సరైన సేవలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా వైద్యాధికారికి అనేకసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించాలని, లేదంటే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.