ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను చలి వణిస్తున్నది. గడిచిన రెండు రోజులుగా రికార్డు స్థాయిలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదువుతున్నాయి. ఉత్తరాది నుంచి వీస్తున్న శీతల పవనాలతో ఉదయం 8 గంటల వరకు కూడా పొగమంచు కప్పి ఉంటుంది. ఆదివారం ఉదయం నుంచి చలి తీవ్రత పెరిగింది. అడవులు ఎక్కువగా ఉన్న ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత మరీ ఎక్కువ ఉండడంతో గిరిజనులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రాష్ట్రంలోనే రికార్డు స్థాయిలో గడిచిన 48 గంటల్లో కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా గిన్నెధరిలో 6.6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.
ఆదిలాబాద్ జిల్లా అర్లి(టీ)లో 6.8, నిర్మల్ జిల్లా పెంబిలో 9, మంచిర్యాల జిల్లా కోటపల్లిలో 10.4 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సోమవారం సాయంత్రానికి గడిచిన 24 గంటల్లో ఆదిలాబాద్లో 7.9, ఆసిఫాబాద్ 8.2, నిర్మల్ 9.0, మంచిర్యాల 10.4 కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, ఉట్నూర్, బోథ్, తిర్యాణి మొదలైన ఏజెన్సీ ప్రాంతాలతోపాటు భైంసా, జన్నారం, కోటపల్లి, వేమనపల్లి ఇలా మారుమూల అడవుల్లోని ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు ఉండి జనం ఇబ్బందులు పడుతున్నారు.
– మంచిర్యాల, డిసెంబర్ 8(నమస్తే తెలంగాణ ప్రతినిధి)
చలి పంజాకు వృద్ధుడు బలి
పెంబి, డిసెంబర్ 8 : పెంబి మండలంలోని చింతగూడ గ్రామానికి చెందిన వృద్ధుడు కర్రె గంగారెడ్డి(60) చలి తీవ్రతకు బలయ్యాడు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా గత రెండు రోజులుగా 6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గంగారెడ్డి మానసిక స్థితి బాగోలేకపోవ డంతో వారం రోజుల నుంచి పెంబి మండల కేంద్రంలోనే తిరుగుతున్నాడు. ఆదివారం రాత్రి పెంబి బస్టాండ్ సమీపంలో గల రోడ్డుపై చలిలోనే పడుకున్నాడు. ఉదయం స్థానిక ప్రజలు గమనించి వృద్ధుడిని లేపగా చలనం లేదు. దీంతో అతడు చలికి మృతిచెందినట్లు గుర్తించారు. గంగారెడ్డి భార్య గతేడాది అనారోగ్యంతో మరణించింది. వీరికి పిల్లలు, ఇల్లు కూడా లేదు.