తాండూర్, ఏప్రిల్ 21 : తాండూర్ పోలీసులు రేషన్ బియ్యం దందాకు సహకరిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతుండగా, శనివారం జరిగిన ఘటనే ఇందుకు బలం చేకూరుస్తున్నది. రేషన్ దందా చేస్తున్న ఓ ముఠా ఏకంగా పోలీస్‌స్టేషన్‌లోనే ఓ వ్యక్తిపై దాడికి యత్నించడం.. ఆపై పోలీసులపై దౌర్జన్యానికి దిగడం చర్చనీయాంశమైంది. ‘మామూళ్లు ఇస్తున్నాం కదా.. మరి బియ్యం ఎలా పట్టుకున్నారు’ అంటూ వారు ఖాకీలపై ఆగ్రహం వ్యక్తం చేయగా, పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వివరాలిలా.. తాండూరు పోలీసులు శనివారం ఆటోలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు.
ఆటో డ్రైవర్ కొల్లూరి శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకోగా, రేషన్ మాఫియా రంగంలోకి దిగింది. తాండూరుకు చెందిన ఎర్ర శ్రీనివాసే.. పోలీసులకు సమాచారం ఇచ్చాడని భావించి ఫజాన బేగం, అమీనా బేగం, టీన బేగం అతడిపైకి గొడవకు వెళ్లారు. దీంతో భయపడ్డ ఎర్ర శ్రీనివాస్ తప్పించుకొని పోలీస్‌స్టేషన్ వెళ్లాడు. అక్కడికి చేరుకున్న ఆ ముగ్గురు మహిళలు అతడిని తమకు అప్పగించాలంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగి ఒత్తిడి తెచ్చారు. దీంతో బిత్తరపోవడం పోలీసుల వంతైంది. పోలీస్‌స్టేషన్‌లోకి దూసుకొచ్చి నానా బూతులు తిట్టి, విధులకు ఆటంకం కలిగించినందుకు ఆ మహిళలపై కేసు నమోదైంది.
‘నెల నెలా మామూళ్లు ఇస్తున్నాం కదా. రంజాన్ కావడంతో ఈ నెల ఇవ్వలేదు. ఎస్ఐ సార్‌ను కలవలేదు. అందుకే మా ఆటోలు పట్టుకున్నరు. సమాచారం ఇచ్చిన వ్యక్తి గోడ దూకి పారిపోతుంటే ఏం చేస్తున్నరు. ఎట్టి పరిస్థితుల్లో ఆ వ్యక్తిని అప్పగించాల్సిందే’ అంటూ ఫజాన బేగం, అమీనా బేగం, టీన బేగం పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేయడం పలు అనుమానాలకు తావిస్తున్నది. రేషన్ దందా లో పోలీసుల పాత్ర ఉన్నట్లు తెలుస్తున్నది. ఇక పోలీసులకు సమాచారం ఇచ్చిన వ్యక్తి సైతం రేషన్ దందా సాగిస్తాడని సమాచారం. మరి ఆ వ్యక్తిని పోలీసులు ఎందుకు వదిలేశారని పలువురు ప్రశ్నించడం కొసమెరుపు.
పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా చేస్తున్న వ్యాపారుల ఆరోపణలు నిజం కాదు. కొద్ది రోజులుగా వరుసగా బియ్యం పట్టుకుంటున్నాం. దీంతో వాళ్లు అనవసరపు ఆరోపణలు చేస్తున్నారు. అక్రమ రవాణా చేసే వారిని వదిలేది లేదు. పోలీస్‌స్టేషన్‌లో ఆందోళ చేసిన వారిపై కేసులు నమోదు చేశాం.
-జగదీశ్‌గౌడ్, తాండూర్ ఎస్ఐ