ఎదులాపురం, ఫిబ్రవరి 9 : షెడ్యూల్డ్ కులాలు, తేగల వారికి ఉచిత విద్యుత్‌పై అవగాహన కల్పించాలని, కుల ధ్రువీకరణ పత్రాలు అందించాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ఉచిత విద్యుత్, కుల ధ్రువీకరణ పత్రాల జారీపై విద్యుత్, రెవెన్యూ, గిరిజన దళిత సంక్షేమ శాఖల అధికారులతో బుధవారం వర్చువల్ విధానం ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. షెడ్యూల్డ్ కులాలు, తెగల వారికి నెలకు 101 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ అందించేందుకు మండలస్థాయిలో రెవెన్యూ, విద్యుత్ శాఖల సిబ్బంది సమన్వయంతో చర్యలు చేపట్టాలని సూచించారు. మండలస్థాయి డేటాను రెవెన్యూ అధికారులకు అందించాలని విద్యుత్ శాఖ ఎస్ఈని ఆదేశించారు. గ్రామ సభలు, పిసా కోఆర్డినేటర్ల ద్వారా ప్రచారం నిర్వహించాలన్నారు. అనంతరం అదనపు కలెక్టర రిజ్వాన్ బాషా షేక్ మాట్లాడుతూ.. ఉచిత విద్యుత్‌పై ప్రజలకు తెలియజేసేలా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని యంత్రాంగం ప్రచారం చేయాలన్నారు. కుల ధ్రువీకరణ పత్రాలను మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకునేలా తెలియజేయాలని సూచించారు. ఆ తర్వాత విద్యుత్ శాఖ ఎస్ఈ ఉత్తమ్‌జాడే మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీలకు నెలకు 101 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పంపిణీ చేస్తున్నట్లు, ఆయా కులాలకు సంబంధించిన శాఖ ద్వారా సబ్సిడీ అందించనున్నట్లు చెప్పారు. షెడ్యూల్డ్ కులాలకు సంబంధించి ఇప్పటి వరకు 8,368 మంది కుల ధ్రువీకరణ పత్రాలను, షెడ్యూల్డ్ తెగలకు సంబంధించి 14,300 మంది కుల ధ్రువీకరణ పత్రాలను పోర్టల్‌లో అప్లోడ్ చేసినట్లు తెలిపారు. కుల ధ్రువీకరణ పత్రం లేకపోవడం వల్ల చాలా మందికి లబ్ధిచేకూరడంలేదన్నారు. అనంతరం ఆర్టీవో రాజేశ్వర్ మాట్లాడుతూ.. కుల ధ్రువీకరణ పత్రాలు మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని, తద్వారా ఆయా తహసీల్దార్లు జారీ చేస్తారని తెలిపారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించాలన్నారు. పంచాయతీ కార్యదర్శి, మండల పరిషత్ అధికారులు, ఎంపీడీవోలు, స్థానిక ప్రజా ప్రతినిధుల సహకారంతో ఉచిత విద్యుత్‌పై ప్రజలకు తెలియజేయాలని సూచించారు. అనంతరం జిల్లా గిరిజన సంక్షేమ అధికారి సంధ్యారాణి, మున్సిపల్ కమిషనర్ శైలజ మాట్లాడారు. ఈ సమావేశంలో తహసీల్దారు, విద్యుత్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.