కుభీర్: గత నెల రోజులుగా వర్షం కోసం ఎదురుచూస్తున్న కుభీర్ మండల రైతన్నలకు శనివారం కురిసిన వర్షం ( Rain ) ఎంతో ఊరటనిచ్చింది. శనివారం మధ్యాహ్నం నుంచి మండలంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుండడంతో రైతుల మోముల్లో ఆనందం వెల్లివిరిసింది. వరుణుడు కరుణించడంతో ఎండిపోతున్న పంటలకు ప్రాణం వచ్చినట్లైందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
గత నెల రోజులుగా మండలంలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ముఖ్యంగా సోయాబీన్ ( Soybean ) , పత్తి ( Cotton ) అందకపోతే దిగుబడులు తగ్గే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. అదేవిధంగా పత్తి పంటకు కూడా ప్రస్తుత వర్షం ఎంతో అవసరమని రైతులు చెబుతున్నారు.
వర్షాలు లేక నేలలో తేమ తగ్గిపోవడంతో పంటలు వాడిపోతున్న పరిస్థితి నెలకొంది. కొందరు రైతులు బోరు బావుల ద్వారా పంటలను కాపాడుకునేందుకు ప్రయత్నించినప్పటికీ విద్యుత్ సరఫరాలో అంతరాయాలు, నీటి కొరత వంటి సమస్యలు ఎదుర్కొన్నారు.ఈ తరుణంలో శనివారం మధ్యాహ్నం నుంచి వర్షం ప్రారంభం కావడంతో రైతుల్లో కొత్త ఆశలు చిగురించాయి.
వర్షపు నీటితో పొలాల్లో తేమ పెరిగి పంటలకు ప్రయోజనం చేకూరుతుందని రైతులు భావిస్తున్నారు. మరికొన్ని రోజులు ఇదే విధంగా వర్షాలు కొనసాగితే సోయాబీన్, పత్తి పంటలకు మరింత మేలు జరుగుతుందని అన్నారు. వర్షం కోసం ఆకాశం వైపు ఆశగా ఎదురుచూస్తున్న రైతన్నలకు శనివారం కురిసిన వాన కాస్త ఉపశమనం కలిగించింది.