కుభీర్, జనవరి 23 : నిర్మల్ జిల్లా కుభీర్‌లో గురువారం నిర్వహించిన గ్రామసభకు భైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ సింధే ఆనంద్‌రావు పటేల్ హాజరయ్యారు. అనర్హులకు జాబితాలో చోటు కల్పించారంటూ రైతులు, ప్రజలు, నాయకులు అధికారులతో వాదనకు దిగారు. కల్పించుకున్న చైర్మన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పలువురు రైతులు రూ.2లక్షల వ్యవసాయ రుణాలు మాఫీ చేసిందా మీ ప్రభుత్వం అంటూ మండిపడ్డారు. మీ గ్రామ పంచాయతీ మీ వ్యవస్థ, మీ ఇష్టం..ఇలా జీపీకి తాళం వేసే ప్రయత్నం చేయడం, గ్రామ సభను రద్దు చేయడం తప్పు అంటూ అక్కడి నుంచి నిష్కృమించారు. బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఎన్నీల అనిల్, మాజీ మండలాధ్యక్షుడు సావుల మల్లన్న, ఏశాల దత్తాత్రి, సోషల్ వర్కర్ సాప పండరి, పడిపెల్లి గంగాధర్, సంతోష్, బామన్ శేఖర్, కనకయ్య లబ్దిదారులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ఎంపీడీవో నవనీత్ కుమార్ దిద్దుబాటు చర్యలను చేపట్టారు. వెంటనే రంజిని పంచాయతీ కార్యదర్శి గౌతంను కుభీర్ మేజర్ పంచాయతీకి ఇన్చార్జి కార్యదర్శిగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. మళ్లీ శుక్రవారం ఉదయం 10.30 గంటలకు గ్రామసభ నిర్వహిస్తామని తెలిపారు.
ఖానాపూర్ రూరల్, జనవరి 23: నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని బావాపూర్(ఆర్), దేశినాయక్తండా, దిలావర్పూర్, గోసంపల్లి, కొత్తపేట్, మేడంపల్లి, పాత తర్లపాడు, తర్లపాడ్, సుర్జాపూర్, కొలంగూడ, ఏర్వచింతల్ గ్రామాల్లో గురువారం గ్రామ సభలు నిర్వహించారు. ఇందిరమ్మ ఇండ్లు, ఆత్మీయ భరోసా లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా నిర్వహించలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక నాయకులు ప్రజలను శాంతింపజేసే ప్రయత్నం చేయగా గ్రామస్తులు నిరాకరించడంతో అధికారులు అర్ధంతరంగా సభలు ముగించారు. ఈ సభల్లో తహసీల్దార్ శివరాజ్, ఆయా గ్రామాల ప్రత్యేకాధికారులు, పలు శాఖల అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.
లోకేశ్వరం, జనవరి 23 : నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని రాయపూర్ కాండ్లి, రాజురా గ్రామాల్లో నిర్వహించిన ప్రజాపాలన గ్రామసభలు రసాభాసగా మారాయి. అర్హులకు రేషన్‌కార్డులు అందిస్తామని చెప్పిన అధికారులు, నాయకులు ఎక్కడంటూ ప్రశ్నించారు. అలాగే రుణమాఫీ, రైతు భరోసా, ఆరు గ్యారెంటీల హామీలు ఎక్కడ అంటూ గ్రామస్తులు కాంగ్రెస్ నాయకులను, అధికారులను నిలదీశారు. రుణమాఫీకి అన్ని అర్హత ఉన్నా మాఫీ ఎందుకు కాలేదు అంటూ రైతులు అధికారులను నిలదీశారు. దరఖాస్తులు ఎన్నిసార్లు ఇచ్చిన ఎటువంటి లాభం లేదని, నచ్చజెప్పడానికి మాత్రమే గ్రామసభలు ఏర్పాటు చేశారని ప్రజలు తిరగబడ్డారు. దరఖాస్తులు ఇచ్చినా కూడా ఎటువంటి లాభం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
సోన్, జనవరి 23: నిర్మల్ మండలంలోని వెంగ్వాపేట్, అనంతపేట్ గ్రామాల్లో నిర్వహించిన గ్రామసభకు అధికారులు హాజరయ్యారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్‌కార్డులు, ఆత్మీయ భరోసా పథకంలో పేర్లను చదివి వినిపించారు. ఆత్మీయ భరోసా పథకంలో భూమి ఉన్న వారికే పేర్లు కేటాయించారని అధికారులను నిలదీశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాలు వర్తిస్తాయని ఇది నిరంతర పక్రియ అని జాబితాలో పేర్లు రానివారు దరఖాస్తులు అందించాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ సంతోష్, ఎంపీడీవో గజానంద్, ఎంపీఓ శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్నారు.
దిలావర్పూర్, జనవరి 23: మండలంలోని న్యూలోలం, కాల్వ, కాల్వతండా గ్రామ పంచాయతీల్లో గ్రామసభలు నిర్వహించారు. ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల జాబితాను అధికారులు చదివి వినిపించారు. అర్హుల పేర్లు జాబితాల్లో లేవని అధికారులను ప్రజలు నిలదీశారు. అర్హులైన వారు ఉంటే మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని అధికారులు కోరారు. ఈ గ్రామ సభల్లో తహసీల్దార్ స్వాతి, ఎంపీడీవో అరుణరాణి, ఎంపీవో గోవర్ధన్, ఏపీవో దివ్యరెడ్డి, ఏవో రాజశేఖర్, ఏఈవోలు శ్రీవాణి, మౌనిక, పంచాయతీ కార్యదర్శులు శ్రావణ్, కిరణ్, రైతులు పాల్గొన్నారు.
తలమడుగు, జనవరి 23 : ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని కొత్తూరు, నందిగామ, సకినాపూర్, ఉండం గ్రామాల్లో గురువారం అధికారులు గ్రామ సభలు నిర్వహించారు. కొత్తూరు గ్రామసభలో రైతులు తమకు రుణమాఫీ రాలేదని, రైతు కూలీ భరోసాలో అర్హులైన వారి పేర్లు లేవని అధికారులను ప్రశ్నించారు. ఈ సమవేశాల్లో మండల ప్రత్యేక అధికారి గజానాన్, ఎంపీడీవో శేఖర్, తహసీల్దార్ రాజమోహన్, మండల వ్యవసాయ శాఖ అధికారి ప్రమోద్ రెడ్డి, ఏపీవో మేఘమాల, అధికారులు గ్రామస్తులు పాల్గొన్నారు.