హాజీపూర్, జూలై 21 : హాజీపూర్ మండలం ర్యాలీగఢ్‌పూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని దుర్గాదేవి (క్వారీ) జాతర ఆదివారం వైభవంగా సాగింది. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. బోనాలు, నైవేద్యాలు సమర్పించి ‘సల్లంగ సూడు తల్లీ’ అంటూ వేడుకున్నారు. వాహనాలకు పూజలు నిర్వహించి.. కోళ్లు, మేకలను బలి ఇచ్చి సహపంక్తి భోజనాలు చేశారు.
పోచమ్మ, నాగదేవత ఆలయాల్లోనూ పూజలు చేశారు. మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు, ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. మంచిర్యాల ఏసీపీ ప్రకాశ్ ఆధ్వర్వంలో మంచిర్యాల సీఐ బన్సీలాల్, మంచిర్యాల రూరల్ సీఐ ఆకుల అశోక్, లక్షెట్టిపేట సీఐ అల్లం నరేందర్, ట్రాఫిక్ సీఐ సత్యనారాయణ, మహిళా పోలీస్ స్టేషన్ సీఐ నరేశ్‌కుమార్, ఎస్ఐలు బందోబస్తు నిర్వహించారు.
