నేరడిగొండ, జనవరి 5 : ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు గుణాత్మక విద్యను అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని జడ్పీటీసీ జాదవ్ అనిల్ అన్నారు. తొలిమెట్టు కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎంఈవో అన్రెడ్డి భూమారెడ్డి ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన మండల స్థాయి బోధనాభ్యసన సామగ్రి(టీఎల్ఎం) మేళాను ఎంపీపీ రాథోడ్ సజన్తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా జడ్పీటీసీ మాట్లాడుతూ విద్యార్థులలో సృజనాత్మకతను వెలికితీయడంలో ఉపాధ్యాయులు ముందుకు సాగాలన్నారు. ఈ మేళా ద్వారా పాఠశాలలో బోధిస్తే విద్యార్థుల సామర్థ్యం పెరుగుతుందన్నారు. 39 పాఠశాలలకు గాను 58 మంది ఉపాధ్యాయులు తయారు చేసిన బోధన సామగ్రిని ప్రదర్శించారు. కార్యక్రమంలో జిల్లా ఏఎస్వో నర్సయ్య, స్టేట్ అబ్జర్వర్ కిషన్, అబ్జర్వర్లు శ్రీనివాస్‌గౌడ్, సుభాష్‌రెడ్డి, గంగాధర్, రాజ్‌కుమార్, ఉప సర్పంచ్ దేవేందర్‌రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
గ్రామీణ క్రీడాకారులు ఆటల్లో రాణించాలి
గ్రామీణ క్రీడాకారులు ఆటల్లో ఉన్నతంగా రాణించాలని జడ్పీటీసీ జాదవ్ అనిల్ సూచించారు. మండలంలోని చిన్న బుగ్గారం గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీపీ రాథోడ్ సజన్, సర్పంచ్ జాదవ్ సుభాష్, నేరడిగొండ ఉపసర్పంచ్ దేవేందర్ రెడ్డి, పవార్ విలాస్, నాయకులు రాథోడ్ లింబాజీ, సోమేశ్, సందీప్, హరి, కరణ్‌సింగ్, యువకులు పాల్గొన్నారు.
విద్యాభివృద్ధికే టీఎల్ఎం మేళా
తలమడుగు జనవరి 5 : విద్యాభివృద్ధికి ఉపాధ్యాయులు తయారు చేసిన బోధనాభ్యసన సామగ్రి(టీఎల్ఎం) మేళా ఎంతో తోడ్పడుతుందని ఎంఈవో నారాయణ అన్నారు. మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో మండలస్థాయి టీఎల్ఎం మేళా నిర్వహించారు. ఈ మేళాలో మండలంలోని వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు తయారు చేసిన తెలుగు, ఇంగ్లిష్, గణితం, పరిసరాల పరిజ్ఞానంపై ప్రదర్శించారు. కార్యక్రమంలో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు శ్యాం సుందర్, మహేందర్ యాదవ్, కృష్ణకుమారి, ఉపాధ్యాయులు రవీందర్, నవీన్ యాదవ్, సురేందర్ యాదవ్, గంగయ్య, సంజీవ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.