భైంసా, జూన్ 6 : నిర్మల్ జిల్లా భైంసా మున్సిపాలిటీని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు సమష్టిగా కృషి చేయాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా సూచించారు. శనివారం భైంసా మున్సిపల్ కార్యాలయంలో మున్సిపాలిటీ అభివృద్ధి పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల సమస్యలు క్షేత్రస్థాయిలో తెలుసుకొని పరిష్కరించేలా అధికారులు పనిచేయాలని సూచించారు.
వర్షాకాలం నేపథ్యంలో వరదల నివారణ చర్యలు, ఘన వ్యర్థాల నిర్వహణ, పట్టణ పరిశుభ్రత, మొక్కలు నాటడం, ఎస్ఐఆర్ ప్రక్రియ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అనంతరం ఎస్పీ జానకీ షర్మిల మాట్లాడుతూ.. సామాజిక మాధ్యమాలను బాధ్యతాయుతంగా వినియోగించాలని సూచించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే రామారావు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, ఏఎస్పీ సాయికిరణ్, మున్సిపల్ చైర్మన్ తుమోల్ల దత్తాత్రి, మున్సిపల్ కమిషనర్ లింగయ్య పాల్గొన్నారు.