మంచిర్యాల అర్బన్/నస్పూర్, ఫిబ్రవరి 6 : జన్నారం మండలంలోని కవ్వాల్ టైగర్ ఫారెస్ట్‌లో విధించిన ఆంక్షలు వెంటనే ఎత్తివేయాలని, స్థానికులతో దురుసుగా ప్రవర్తిస్తున్న అటవీశాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని నవతరం స్టూడెంట్ ఫెడరేషన్ (ఎన్ఎస్ఎఫ్) రాష్ట అధ్యక్షుడు నీరటి రామ్ ప్రసాద్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని జిల్లా అటవీ శాఖ అధికారి కార్యాలయం వద్ద నాయకులతో కలిసి ధర్నా నిర్వహించారు.
అనంతరం వారు మాట్లాడుతూ సమస్య తీవ్రరూపం దాల్చకముందే అధికారులు చొరవ తీసుకొని జన్నారం మండలంలో విధిస్తున్న ఆంక్షలను ఎత్తివేయాలని, లేదంటే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అనంతరం కలెక్టరేట్లో వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు రాకేశ్, ఆదిత్య, అభిరామ్, సల్మాన్, సంజయ్ తదితరులు పాల్గొన్నారు.