నేరడిగొండ, డిసెంబర్ 23 : రాజీమార్గంతో కేసులకు సత్వర పరిష్కారం లభిస్తుందని, దీంతో ఇరువర్గాలు గెలిచినట్లే అవుతుందని బోథ్ సివిల్ కోర్టు జడ్జి హుస్సేన్ అన్నారు. మండలంలోని వాగ్ధారి గ్రామంలో శనివారం మండల న్యాయ సేవాధికార సంస్థ, బోథ్ ఆధ్వర్యంలో గ్రామస్తులకు చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ గ్రామాన్ని గుడుంబా రహిత గ్రామంగా తీర్చిదిద్దడానికి గ్రామస్తులు సహకరించాలని కోరారు. విద్యాహక్కు, బాల్య వివాహాలు, మోటార్ వెహికిల్ యాక్ట్, సైబర్ నేరాలు, లోక్ అదాలత్‌పై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. బోథ్ ఎమ్మెల్యే జాదవ్ అనిల్ మాట్లాడుతూ గ్రామస్తులు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. గ్రామస్తులు ఐక్యమత్యంగా ఉండాలని సూచించారు. స్థానిక సర్పంచ్ గంగాదేవి, ఎంపీపీలు రాథోడ్ సజన్, తుల శ్రీనివాస్, కోర్టు సూపరింటెండెంట్ చంద్రశేఖర్‌రెడ్డి, ఎక్సైజ్ శాఖ సీఐ రాజమౌళి, న్యాయవాది హరీశ్, పంద్రం శంకర్, తదితరులు పాల్గొన్నారు.